PM Modi: జకార్తాలో మోదీ మార్క్ దౌత్యం.. భారత్-ఇండోనేషియా మధ్య 20 చారిత్రాత్మక ఒప్పందాలు!

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటనలో రెండు దేశాల మధ్య రక్షణ, డిజిటల్ రంగాల్లో మొత్తం 20 చారిత్రాత్మక ఒప్పందాలు కుదిరాయి.

Arun Chilukuri
Published on: 8 July 2026 10:54 AM IST
PM Modi
X

 PM Modi: జకార్తాలో మోదీ మార్క్ దౌత్యం.. భారత్-ఇండోనేషియా మధ్య 20 చారిత్రాత్మక ఒప్పందాలు!

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన భారత్-ఇండోనేషియా దౌత్య సంబంధాలలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖించింది. రెండు దేశాల మధ్య రక్షణ, వాణిజ్యం, డిజిటల్ టెక్నాలజీ, విద్య, ఖనిజాలు, మౌలిక సదుపాయాలు మరియు సాంస్కృతిక వారసత్వం వంటి అత్యంత కీలక రంగాలలో మొత్తం 20 చారిత్రాత్మక ఒప్పందాలు (MoUs), అవగాహన పత్రాలు కుదిరాయి. ఈ పర్యటన విశేషాలపై ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. "భారత్-ఇండోనేషియా స్నేహబంధం ఎంతో బలంగా, సజీవంగా కొనసాగుతోంది" అని హర్షం వ్యక్తం చేశారు.

ఈ ద్వైపాక్షిక చర్చల్లో రక్షణ రంగానికి ఇరు దేశాలు అత్యంత ప్రాధాన్యతనిచ్చాయి. ఇప్పటికే భారత్ నుండి 'బ్రహ్మోస్' సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులను వాడుతున్న ఇండోనేషియా.. మరిన్ని బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు అంగీకరించింది.

దీనితో పాటు, భారత్ స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన అత్యాధునిక ఎయిర్-టు-ఎయిర్ ‘అస్త్ర’ (Astra BVRAAM) క్షిపణులను సైతం ఇండోనేషియా కొనుగోలు చేయనుంది. ఈ క్షిపణులను ఇండోనేషియా వాయుసేనకు చెందిన సుఖోయ్-30 యుద్ధ విమానాలలో అమర్చేందుకు భారత్‌కు చెందిన ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ 'భారత్ డైనమిక్స్ లిమిటెడ్' (BDL) సాంకేతిక సహకారం అందించనుంది. అలాగే హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మకంగా కీలకమైన 'సబాంగ్ పోర్ట్' సంయుక్త అభివృద్ధికి ఇరు దేశాలు అంగీకరించాయి.

భారత్‌లో డిజిటల్ విప్లవాన్ని సృష్టించిన యూపీఐ (UPI) తరహా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను ఇకపై ఇండోనేషియాలోనూ అమలు చేయనున్నారు. అలాగే భారతదేశపు ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) నమూనా ఆధారంగా ఇండోనేషియాలో 'ION' పేరుతో సరికొత్త డిజిటల్ కామర్స్ నెట్‌వర్క్‌ను ప్రారంభించనున్నారు. దీనివల్ల ఇరు దేశాల ప్రయాణికులు, వ్యాపారులకు డిజిటల్ లావాదేవీలు మరింత సులభతరం కానున్నాయి.

వచ్చే 2029లో జరగనున్న ఇండోనేషియా సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం భారత ఎన్నికల సంఘం నిపుణులు సాంకేతిక సాయం అందించనున్నారు. ఆ దేశ అవసరాలకు తగినట్లుగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (EVMs) రూపకల్పనలో భారత్ మార్గదర్శకత్వం వహించనుంది.

ఎలక్ట్రిక్ వాహనాలు (EV), అడ్వాన్స్‌డ్ టెక్నాలజీకి కీలకమైన ఉక్కు, నికెల్, రేర్ ఎర్త్ ఖనిజాల సరఫరా గొలుసును బలోపేతం చేసేందుకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఇండోనేషియాలోని రేర్ ఎర్త్ శాశ్వత అయస్కాంతాల (Magnets) తయారీ యూనిట్లలో భారత్ భారీగా పెట్టుబడులు పెట్టనుంది.

విద్యా రంగంలో సరికొత్త అడుగు వేస్తూ.. భారత ప్రతిష్టాత్మక విద్యాసంస్థ 'ఐఐఎం బెంగళూరు' (IIM Bangalore) ఇండోనేషియాలో తన మొట్టమొదటి అంతర్జాతీయ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. సాంస్కృతిక రంగంలో భాగంగా ఇండోనేషియాలోని చారిత్రక 'ప్రంబనన్ ఆలయం' పునరుద్ధరణ, పరిరక్షణ బాధ్యతలకు భారత్ సాంకేతిక సహకారం అందించనుంది.

రెండు దేశాల బంధాన్ని బలోపేతం చేసినందుకు గానూ ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘బింటాంగ్ ఆదిపూర్ణ’ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రదానం చేసి గౌరవించారు.

జకార్తాలో జరిగిన ప్రవాస భారతీయుల ఘనస్వాగత సభలో అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నేను ప్రధాని మోదీకి చాలా పెద్ద అభిమానిని, ఆయన విధానాలను నిరంతరం గమనిస్తుంటాను. ఇటీవల నేను డీఎన్‌ఏ (DNA) పరీక్ష చేయించుకోగా నాలో భారతీయ మూలాలు ఉన్నట్లు తేలింది. అందుకే భారతీయ సంగీతం వినగానే నా శరీరం సహజంగానే నాట్యం చేస్తుంది" అని ఆయన సరదాగా అనడంతో సభలో నవ్వులు పూశాయి. ప్రవాస భారతీయులు చూపిన అపార ప్రేమాభిమానాలకు ప్రధాని మోదీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story