El Nino: భారత్ పై ఎల్‌నినో ఎఫెక్ట్: జనవరి 2027 వరకు ఇదే పరిస్థితి.. తేల్చి చెప్పిన శాస్త్రవేత్తలు
El Nino: పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో పరిస్థితులు ప్రారంభమయ్యాయని ఇన్‌కాయిస్ వెల్లడించింది. దీని ప్రభావం 2027 జనవరి వరకు ఉంటుందని, భారత రుతుపవనాలపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించింది.
El Nino: భారత్ పై ఎల్‌నినో ఎఫెక్ట్: జనవరి 2027 వరకు ఇదే పరిస్థితి.. తేల్చి చెప్పిన శాస్త్రవేత్తలు
El Nino: భారత వాతావరణ ముఖచిత్రం మారబోతోంది. తూర్పు, మధ్య పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలలో వస్తున్న మార్పుల నేపథ్యంలో 'ఎల్‌నినో' (El Niño) అధికారికంగా ప్రారంభమైందని హైదరాబాద్‌కు చెందిన ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS) ప్రకటించింది. ఏప్రిల్ వరకు తటస్థంగా ఉన్న సముద్ర పరిస్థితులు ప్రస్తుతం ఎల్‌నినోగా మారాయని వెల్లడించింది.
ప్రస్తుత మే నెల నుంచి మొదలైన ఈ ఎల్‌నినో పరిస్థితులు 2027 జనవరి వరకు కొనసాగుతాయని ఇన్‌కాయిస్ మంగళవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఈ పరిణామాలు భారత వేసవి రుతుపవనాలపై (Monsoon) తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, దీనివల్ల వర్షపాతం గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఇన్‌కాయిస్ శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన 'బేయేసియన్ కన్వల్యూషనల్ న్యూరల్ నెట్‌వర్క్' (BCNN) అనే డీప్ లెర్నింగ్ మోడల్ ద్వారా ఈ అంచనాలను రూపొందించారు. ఈ అధునాతన సాంకేతికత ద్వారా భవిష్యత్తులో వచ్చే ఎల్‌నినో లేదా లా నినా పరిస్థితులను 24 నెలల ముందే పసిగట్టవచ్చని సంస్థ తెలిపింది.
ఎల్‌నినో ప్రభావంతో ఉత్తర హిందూ మహాసముద్రంలో బలమైన మరియు సుదీర్ఘమైన సముద్రపు వేడిగాలులు (Marine Heatwaves) ఏర్పడుతున్నాయని ఇన్‌కాయిస్ స్పష్టం చేసింది. ఇవి సముద్ర పర్యావరణ సమతౌల్యాన్ని దెబ్బతీయడమే కాకుండా, మత్స్య సంపదపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.




