Bhojshala Case : భోజ్‌శాల కేసులో చారిత్రాత్మక తీర్పు.. అది సరస్వతీ దేవి ఆలయమే..!

Bhojshala Case : చాలా ఏళ్లుగా సాగుతున్న భోజ్‌శాల వివాదంపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఉన్న

G Krishna
Published on: 15 May 2026 4:44 PM IST
Bhojshala
X

Bhojshala

Bhojshala Case : చాలా ఏళ్లుగా సాగుతున్న భోజ్‌శాల వివాదంపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఉన్న వివాదాస్పద భోజ్‌శాల ప్రాంగణాన్ని సరస్వతీ దేవి ఆలయంగా గుర్తిస్తూ హైకోర్టు ఇండోర్ బెంచ్ తీర్పునిచ్చింది. దేశవ్యాప్తంగా మందిర్-మసీదు వివాదాల్లో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న ఈ కేసులో హిందూ పక్షానికి భారీ విజయం లభించింది. ఏళ్ల తరబడి సాగిన న్యాయ పోరాటం తర్వాత వెలువడిన ఈ తీర్పు ప్రకారం, భోజ్‌శాల ప్రాంగణంలో హిందువులు యథావిధిగా పూజలు చేసుకునే హక్కును పొందారు. అంతేకాకుండా, అక్కడ సరస్వతీ దేవి విగ్రహాన్ని పునఃప్రతిష్టించుకోవచ్చని కోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ మొత్తం ప్రాంతాన్ని భారత పురావస్తు శాఖ (ASI) తన పూర్తి ఆధీనంలోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.

చారిత్రక ఆధారాలు, ఏఎస్ఐ నివేదిక

ఈ కేసులో భారత పురావస్తు శాఖ సమర్పించిన శాస్త్రీయ సర్వే నివేదికను హైకోర్టు ప్రధానంగా ప్రస్తావించింది. భోజ్‌శాల ప్రాంగణం ఒకప్పుడు గొప్ప సంస్కృత విద్యా కేంద్రంగా విలసిల్లిందని కోర్టు పేర్కొంది. చరిత్రను పరిశీలిస్తే, పరమార వంశానికి చెందిన భోజ రాజు క్రీ.శ. 1034వ సంవత్సరంలో వాగ్దేవి (సరస్వతీ దేవి)కి అంకితం చేస్తూ ఇక్కడ ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు. అయితే, క్రీ.శ. 1305లో అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్ర సమయంలో ఈ ఆలయం కూల్చివేయబడిందని, ఆ తర్వాత అదే ఆలయ శిథిలాలను ఉపయోగించి అక్కడ మసీదును నిర్మించారనే హిందూ పక్షం వాదనలతో కోర్టు ఏకీభవించింది. ముస్లిం పక్షం , జైన్ సమాజ్ దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టేస్తూ, ప్రాచీన కాలం నుండి ఇది హిందూ ధార్మిక కేంద్రమేనని స్పష్టం చేసింది.

పాత ఉత్తర్వుల రద్దు.. కొత్త మార్గదర్శకాలు

2003లో ఏఎస్ఐ జారీ చేసిన ఒక ఉత్తర్వు ప్రకారం.. ప్రతి మంగళవారం హిందువులు పూజలు చేసుకోవడానికి, ప్రతి శుక్రవారం ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి ఉండేది. అయితే, ఈ పద్ధతి హిందువుల ఆరాధన హక్కులను పరిమితం చేస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆనాటి ఏఎస్ఐ ఉత్తర్వులను రద్దు చేస్తూ, అక్కడ హిందువుల పూజలు ఎన్నడూ ఆగలేదని ధర్మాసనం గుర్తు చేసింది. ముస్లింలు ప్రార్థనల కోసం ప్రభుత్వం నుండి వేరే స్థలాన్ని కోరవచ్చని సూచిస్తూ, భోజ్‌శాల ప్రాంగణంలో హిందూ భక్తులకు పూర్తి హక్కులను కల్పించింది. జూలై 2024లో ఏఎస్ఐ సమర్పించిన శాస్త్రీయ అధ్యయన నివేదిక ఈ తీర్పులో అత్యంత కీలక పాత్ర పోషించింది.

హిందూ పక్షం హర్షం, చారిత్రక విజయం

హైకోర్టు తీర్పుపై హిందూ పక్షం న్యాయవాది విష్ణు శంకర్ జైన్ స్పందిస్తూ, ఇది ఒక చారిత్రాత్మక తీర్పు అని, సనాతన ధర్మ అనుసరణకు కోర్టు పూర్తి రక్షణ కల్పించిందని హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఖిల్జీ వంటి ఆక్రమణదారులు చేసిన విధ్వంసాన్ని సరిదిద్దుతూ, భోజ్‌శాల వైభవాన్ని తిరిగి తీసుకువచ్చేలా కోర్టు నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. ఈ తీర్పుతో ధార్‌లోని భోజ్‌శాల ప్రాంగణంలో తిరిగి సరస్వతీ దేవి ఆరాధన పూర్తి స్థాయిలో ప్రారంభం కానుంది. పురావస్తు శాఖ పర్యవేక్షణలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి, ప్రాచీన సంస్కృత విద్యా కేంద్రంగా దీని విశిష్టతను కాపాడాలని కోర్టు ఆకాంక్షించింది.


G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story