Forced marriage: హోటల్ రూమ్‌లో దొరికిన జంట..ప్రియురాలు హ్యాపీ.. ప్రియుడు షాక్..!

Forced marriage: బీహార్ రాజధాని పాట్నాలోని జక్కన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఒక వింత పెళ్లి జరిగింది.

Naresh.k
Published on: 22 May 2026 10:54 AM IST
Forced marriage
X

Forced marriage: హోటల్ రూమ్‌లో దొరికిన జంట..ప్రియురాలు హ్యాపీ.. ప్రియుడు షాక్..!

Patna Police Station : సాధారణంగా పోలీస్ స్టేషన్ అంటే నేరస్థులు, లాకప్‌లు, గొడవలతో అల్లకల్లోలంగా ఉంటుంది. కానీ బీహార్ రాజధాని పాట్నాలోని ఒక పోలీస్ స్టేషన్ మాత్రం రాత్రికి రాత్రే పెళ్లి మండపంగా మారిపోయింది. ఒకే పెళ్లి.. కానీ అక్కడ సీన్ కట్ చేస్తే.. వధువు ముఖంలో నా ఐదేళ్ల కల నెరవేరింది అన్నంత పరమానందం.. వరుడి ముఖంలో మాత్రం నన్ను బలవంతంగా బలిపశువును చేశారు అన్నంత తీవ్ర అసంతృప్తి. సినిమా స్క్రిప్ట్‌ను తలపించే ఈ రియల్ లైఫ్ డ్రామా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

నవాడా జిల్లాకు చెందిన వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. సుమారు వారం క్రితం ఇళ్ల నుంచి పారిపోయి పాట్నా చేరుకున్నారు. జక్కన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిథాపూర్ పాత బస్ స్టాండ్ సమీపంలో ఉన్న ఒక హోటల్‌లో మకాం పెట్టారు. అయితే, బుధవారం (మే 20) ఉదయం అమ్మాయి కుటుంబ సభ్యులు ఇచ్చిన పక్కా సమాచారంతో పోలీసులు ఆ హోటల్‌పై మెరుపు దాడి చేశారు. ప్రేమికులిద్దరినీ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడికి ఇరు కుటుంబాల సభ్యులు కూడా చేరుకోవడంతో అసలు హైడ్రామా మొదలైంది.

పోలీస్ స్టేషన్ లోపల దాదాపు నాలుగు గంటల పాటు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఢిల్లీలో చదువుకుంటూ ఉద్యోగం చేస్తున్న రాజేష్.. తాను ఇప్పుడు పెళ్లి చేసుకోలేనని ససేమిరా అన్నాడు.తమ కుమార్తె ఇన్ని రోజులు అతడితో కలిసి హోటల్‌లో గడిపిన తర్వాత, ఆమెను మరెవరూ పెళ్లి చేసుకోరు అని అమ్మాయి కుటుంబ సభ్యులు గట్టిగా వాదించారు. చివరకు రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చి.. స్టేషన్ ప్రాంగణంలోనే పెళ్లి జరిపించాలని డిసైడ్ చేశారు. పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న మనోకామ్నా ఆలయంలో పురోహితుడు విద్యాధర్ శుక్లా శాస్త్రోక్తంగా వీరి వివాహం జరిపించారు. ఇద్దరూ మేజర్లు అని నిర్ధారించుకున్నాకే పెళ్లి చేశానని పూజారి చెబుతున్నా.. పెళ్లి పీటల మీద వరుడి ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

ఇది చట్టవిరుద్ధంగా జరిగిన బలవంతపు పెళ్లి. ఆమె తన ఇష్టప్రకారమే నాతో వచ్చింది. కానీ పోలీసులు నాపై విపరీతమైన ఒత్తిడి తెచ్చి, బెదిరించి ఈ పెళ్లి చేశారు. నేను బలవంతపు పెళ్లికి బాధితుడిని అని వరుడు చెప్పుకొచ్చాడు రాజేష్ నన్ను ఇంటి నుంచి తీసుకువచ్చాడు. ఐదేళ్లుగా మా మధ్య ప్రేమ బంధం ఉంది. ఈ పెళ్లి నా జీవితకాల స్వప్నం.. మా బంధానికి ఇది ఒక పవిత్రతను ఇచ్చింది అని వధువు ఆనందంగా తెలిపింది. సాధారణంగా ఖైదీల అరుపులతో ఉండే పోలీస్ స్టేషన్, ఇలా ఒక వింత పెళ్లికి వేదిక కావడం స్థానికంగా పెద్ద సంచలనంగా మారింది. చట్టం దృష్టిలో ఇద్దరూ మేజర్లు అయినప్పటికీ.. వరుడికి ఇష్టం లేకుండా, పోలీసుల ఒత్తిడితో జరిగిన ఈ వివాహం ఇప్పుడు సరికొత్త వివాదానికి తెరలేపింది.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story