Harbhajan Singh: ఆప్ రాజ్యసభ సీట్లను అమ్ముకుంది.. ట్రోలర్స్‌కు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మైండ్ బ్లాకింగ్ కౌంటర్!

Harbhajan Singh: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన మాజీ క్రికెటర్, ఎంపీ హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 23 May 2026 12:36 PM IST
Harbhajan Singh
X

Harbhajan Singh: ఆప్ రాజ్యసభ సీట్లను అమ్ముకుంది.. ట్రోలర్స్‌కు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మైండ్ బ్లాకింగ్ కౌంటర్!

Harbhajan Singh: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నుంచి రాజ్యసభకు ఎంపికైన భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆయన కాషాయ కండువా కప్పుకోవడంపై సోషల్ మీడియాలో ఆప్ మద్దతుదారులు, నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలపై 'భజ్జీ' ఎట్టకేలకు నోరు విప్పారు. తనను విమర్శిస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇస్తూ.. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ టార్గెట్‌గా సంచలన ఆరోపణలు చేశారు. ఆప్ పార్టీ రాజ్యసభ సీట్లను రేటు కట్టి అమ్మేసిందని బాంబు పేల్చారు.

"ఆప్ నుంచి వచ్చిన రాజ్యసభ సీటుకు ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదు? మీ మనస్సాక్షికి ఎంత వెలకట్టి బీజేపీలో చేరారు?" అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు హర్భజన్ సింగ్ తీవ్రంగా స్పందించారు.

"సమయం వచ్చినప్పుడు అందరి ప్రశ్నలకు తగిన జవాబు చెబుతాను. నన్ను ద్రోహి అనే ముందు.. మీ పార్టీ నేతలు రాజ్యసభ సీటును ఎంత రేటుకు అమ్ముకున్నారో వెళ్లి అడగండి. ఆ వివరాలు వారు మీకు చెప్పకపోతే.. ఎవరికి ఎంత కానుక అందిందో, అది ఎవరి వైపు నుంచి వెళ్లిందో అన్ని ఆధారాలతో సహా నేనే బయటపెడతాను. పంజాబ్‌ను దోచుకోవడానికి మంత్రులు, అధికారులు ప్రజలను ఎలా మోసం చేశారో కూడా వివరిస్తాను. వారు పంజాబ్‌ను పూర్తిగా దోచుకొని నాశనం చేశారు. మీ నాయకుడికి (కేజ్రీవాల్‌ను ఉద్దేశిస్తూ) రాష్ట్రంపై కనీసం 1 శాతమైనా ప్రేమ ఉంటే బాగుండేది" అని భజ్జీ మండిపడ్డారు.

హర్భజన్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు పంజాబ్ రాజకీయాల్లో ఒకేసారి తీవ్ర దుమారం రేపాయి. ఈ పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ నేతలు తక్షణమే స్పందించారు. ఆప్‌లో రాజ్యసభ సీట్లను కొనుగోలు చేసిన వారు, అమ్మిన వారి పూర్తి వివరాలను హర్భజన్ సింగ్ త్వరగా వెల్లడించాలని కోరారు. భజ్జీ చేసిన ప్రకటన ద్వారా ఆప్ పార్టీలో జరుగుతున్న కుట్రలు, అవినీతి బట్టబయలయ్యాయని కాంగ్రెస్ విమర్శించింది. ఈ సీట్ల అమ్మకం వ్యవహారంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వెంటనే పంజాబ్ ప్రజలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. క్రికెటర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన హర్భజన్ సింగ్ చేసిన 'సీట్ల అమ్మకం' వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story