Guwahati Riya Murder: భార్యను చంపి కుక్కకు వేయాలనుకున్నాడా? గువాహటి హత్యలో షాకింగ్ ట్విస్ట్.!
అస్సాం రాజధాని గువాహటిలోని బసిష్ఠాపూర్ ప్రాంతంలో వెలుగుచూసిన 25 ఏళ్ల రియా తాలూక్‌దార్ గోస్వామి దారుణ హత్య కేసు ఇటు పోలీసులను, అటు స్థానికులను తీవ్ర
Guwahati Riya murder
అస్సాం రాజధాని గువాహటిలోని బసిష్ఠాపూర్ ప్రాంతంలో వెలుగుచూసిన 25 ఏళ్ల రియా తాలూక్‌దార్ గోస్వామి దారుణ హత్య కేసు ఇటు పోలీసులను, అటు స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. వివాహమైన కేవలం ఆరు నెలలకే భర్త రామానుజ్ గోస్వామి అనుమానంతో కట్టుకున్న భార్యను అత్యంత నృశంసంగా హతమార్చాడు. ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే భయంకరమైన విషయాలు బయటపడుతున్నాయి.
రక్తసిక్తంగా మారిన ఇల్లు – ఫ్రిజ్‌లో తెగిపడిన తల..
గువాహటిలోని బెల్టోలా పరిధిలోని బసిష్ఠాపూర్ ప్రాంతంలోని ఒక ఇంట్లో నివసిస్తున్న ఈ దంపతులు ఎంతసేపటికీ ఫోన్లు ఎత్తకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రాత్రి సమయంలో తలుపులు తెరిచి చూడగా, ఇంట్లో ఎక్కడ చూసినా రక్తపు మరకలు, చిందరవందరగా పడిన వస్తువులతో భయానక దృశ్యం కనిపించింది. రియా మొండెం నుంచి తల వేరుబడి ఉండటమే కాకుండా, నరికిన ఆమె తలను ఫ్రిజ్‌లోని ఒక నల్లటి పాలిథిన్ కవర్‌లో చుట్టి దాచి ఉంచడం అధికారులను తీవ్రంగా కలిచివేసింది. అంతటితో ఆగకుండా ఆమె చేతి వేళ్లను కూడా దారుణంగా నరికేశాడు. ఘటనా స్థలంలో హత్యకు ఉపయోగించిన పదునైన కత్తిని (స్థానికంగా 'దావ్' అని పిలిచే వేటకత్తి) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పెంపుడు కుక్కకు తినిపించాలని ప్లాన్...
విచారణలో నిందితుడు రామానుజ్ చెప్పిన విషయాలు మరింత భయంకరంగా ఉన్నాయి. భార్యను నరికి చంపిన తర్వాత, ఆ మృతదేహాన్ని తన ఇంట్లోనే ఉన్న పెంపుడు కుక్కకు ఆహారంగా తినిపించాలని ప్లాన్ చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు సమాచారం. అయితే ఈ కుక్క ప్లాన్‌పై నిజానిజాలు తేలాల్సి ఉందని, దీనిపై ఇంకా విచారణ జరుగుతోందని పోలీసు అధికారి తబ్బు రామ్ పేగు స్పష్టం చేశారు. దారుణానికి ఒడిగట్టిన అనంతరం పోలీసులకు లొంగిపోయిన నిందితుడు, భార్యను అంతమొందించినందుకు తనకేమీ పశ్చాత్తాపం లేదని చెప్పడం సంచలనం రేపింది. అంతేకాకుండా, జైలు నుంచి బయటకు వస్తే తన భార్య ‘షుగర్ డాడీ’ అని భావిస్తున్న వ్యక్తిని కూడా చంపేస్తానని నిస్సందేహంగా హెచ్చరించాడు. భార్యకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందనే అనుమానమే ఈ దారుణ హత్యకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
20 సార్లు రిహాబిలిటేషన్ సెంటర్‌కు...
మరోవైపు నిందితుడు రామానుజ్ తీవ్రమైన మత్తు పదార్థాల వ్యసనపరుడని, ఇప్పటివరకు 20 సార్లు కంటే ఎక్కువగానే డ్రగ్స్ రిహ్యాబిలిటేషన్ సెంటర్లకు వెళ్లి వచ్చాడని దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా అతనికి హెచ్‌ఐవీ (HIV), హెపటైటిస్-సి వంటి తీవ్రమైన వ్యాధులు కూడా ఉన్నట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. అయితే ఈ అనారోగ్య సమస్యలకు , ఈ దారుణ హత్యకు ప్రత్యక్ష సంబంధం ఉందో లేదో పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. ప్రస్తుతం సీఐడీ, ఫోరెన్సిక్ , ఫింగర్‌ప్రింట్ నిపుణులు రంగంలోకి దిగి పక్కా ఆధారాలు సేకరిస్తున్నారు. అస్సాంను వణికించిన ఈ దారుణ హత్య వెనుక ఉన్న అసలు నిజాలు, మృతదేహాన్ని కుక్కకు వేయాలనే ఘోరమైన ప్లాన్ వెనుక ఉన్న యదార్థం పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాతే బయటకు రానుంది.




