Gangster Atiq Ahmed: రోడ్డు ప్రమాదంలో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ చిన్న కుమారుడు అబన్ అహ్మద్ మృతి!

Gangster Atiq Ahmed: ఉత్తర్‌ప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ చిన్నకొడుకు అబన్ అహ్మద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

Arun Chilukuri
Published on: 6 Aug 2026 2:31 PM IST
Gangster Atiq Ahmed
X

Gangster Atiq Ahmed: రోడ్డు ప్రమాదంలో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ చిన్న కుమారుడు అబన్ అహ్మద్ మృతి!

Gangster Atiq Ahmed: ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన దివంగత గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ చిన్న కుమారుడు అబన్ అహ్మద్ ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. జైల్లో ఉన్న తన సోదరుడు అలీ అహ్మద్‌ను కలిసేందుకు ప్రయాణిస్తుండగా ఝాన్సీ సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. అబన్ అహ్మద్ తన సహచరులతో కలిసి ప్రయాణిస్తున్న కారు అతివేగం కారణంగా అదుపుతప్పి హైవేపై ఉన్న డివైడర్‌ను తీవ్రస్థాయిలో ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ప్రమాద తీవ్రతకు అబన్ అహ్మద్‌తో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

ఒకప్పుడు తూర్పు ఉత్తర్‌ప్రదేశ్‌లో దశాబ్దాల పాటు భయాందోళనలు సృష్టించిన అతీక్ అహ్మద్ కుటుంబంపై అనేక హత్యలు, కిడ్నాప్‌లు, దందాల కేసులు ఉన్నాయి. బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో కీలక సాక్షి ఉమేశ్ పాల్‌ను దారుణంగా హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొన్న అతీక్, అతడి సోదరుడు అష్రఫ్‌లను 2023 ఏప్రిల్‌లో పోలీసు కస్టడీలో వైద్య పరీక్షలకు తీసుకెళ్తుండగా ముగ్గురు దుండగులు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చిచంపారు. ఉమేశ్ పాల్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న అతీక్ మూడో కుమారుడు అసద్, యూపీ పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు.

అతీక్ పెద్ద కుమారులు మహమ్మద్ ఉమర్, మహమ్మద్ అలీ వేర్వేరు కేసుల్లో జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. కాగా, ఉమేశ్ పాల్ హత్య కుట్రలో భాగస్వామిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అతీక్ భార్య శైస్తా పర్వీన్ ఇప్పటికీ పరారీలోనే ఉంది. తాజాగా చిన్న కుమారుడు అబన్ అహ్మద్ కూడా రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అతీక్ అహ్మద్ కుటుంబం మరోసారి వార్తల్లోకి వచ్చింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story