Mystery Deaths: ఒకే చోట నాలుగు అస్థిపంజరాలు.. చెట్టుకి వేలాడుతున్న ఉరితాళ్లు..ఆ అడవిలో ఏం జరిగింది ?

Mystery Deaths: పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ బర్ధమాన్ జిల్లా అడవుల్లో ఊహించని ఘోరం వెలుగుచూసింది.

CR Reddy
Published on: 10 Sept 2026 9:47 AM IST
Mystery Deaths
X

Mystery Deaths

Mystery Deaths: పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ బర్ధమాన్ జిల్లా అడవుల్లో ఊహించని ఘోరం వెలుగుచూసింది. కంకాసా పోలీస్ స్టేషన్ పరిధిలోని మలాన్ దిఘి అటవీ ప్రాంతంలో ఒకే చోట నాలుగు మానవ అస్థిపంజరాలు లభ్యం కావడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పశ్చిమ బర్ధమాన్ జిల్లా మలాన్ దిఘి పరిధిలోని జాఠ్‌గఢియా మోడ్ సమీపంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో స్థానికులు సంచరిస్తున్న సమయంలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. అడవి లోపల విసిరేసినట్లు పడి ఉన్న మానవ అస్థిపంజరాలను చూసి తీవ్ర భయాందోళనకు గురైన వారు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కంకాసా పోలీస్ స్టేషన్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

చెట్టుకు ఉరితాళ్లు.. కింద నైలాన్ బ్యాగ్

పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించినప్పుడు అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగుచూశాయి. అస్థిపంజరాలు పడి ఉన్న ప్రదేశానికి సరిగ్గా పైన ఉన్న ఒక పెద్ద చెట్టుకు నాలుగు రష్యాలు ఉరితాళ్లలా వేలాడుతూ కనిపించాయి. అంతేకాకుండా ఆ చెట్టు కింద ఒక నైలాన్ బ్యాగ్ పడి ఉండటాన్ని అధికారులు గుర్తించారు. లభ్యమైన అవశేషాల పరిమాణాన్ని బట్టి అందులో ఒకటి చిన్నపిల్లల అస్థిపంజరం అయి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే దీనిపై ఫొరెన్సిక్ నివేదిక వచ్చాకే పూర్తి క్లారిటీ వస్తుందని అధికారులు చెప్తున్నారు.

రంగంలోకి ఫొరెన్సిక్ నిపుణులు

ఈ ఘటన ప్రాధాన్యతను బట్టి ఆసన్సోల్-దుర్గాపూర్ పోలీస్ కమిషనరేట్ డిప్యూటీ కమిషనర్ రాస్ ప్రీత్ సింగ్ నేరుగా రంగంలోకి దిగారు. ఫొరెన్సిక్ విభాగం అధికారుల సమక్షంలో ఆధారాలు దెబ్బతినకుండా ఆ అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. అక్కడ లభించిన నైలాన్ బ్యాగ్ లో ఉన్న వస్తువులు, ఇతర ఆధారాల ద్వారా మృతుల గుర్తింపును కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల కాలంలో చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలను సేకరించి సరిపోల్చే పనిలో పడ్డారు.

సామూహిక ఆత్మహత్యా? లేదా ఘోర హత్యల కుట్ర?

ఈ ఘోరం వెనుక ఏదైనా నేరపూరిత కుట్ర దాగి ఉందా లేదా ఒకే కుటుంబానికి చెందిన వారు సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహాలు అస్థిపంజరాలుగా మారడానికి ఎంత సమయం పట్టింది, వారు ఎప్పుడు మరణించి ఉంటారనే విషయాలు ఫొరెన్సిక్ పరీక్షల ల్యాబ్ నివేదిక వచ్చాకే వెల్లడవుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ మిస్టరీ ముడి విప్పేందుకు అటవీ ప్రాంతం నుంచి పలు కీలక నమూనాలను సేకరించారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story