LPG Booking: హంతకుడికి చెక్ పెట్టిన 'సిలిండర్'.. నాలుగేళ్ల పరారీకి ఎండ్ కార్డ్..
LPG Booking: సినిమాల్లో మాదిరిగా ప్రతిసారి గుర్తింపు మారుస్తూ, పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న ఒక మాజీ ఆర్మీ కెప్టెన్ ఎట్టకేలకు పట్టుబడ్డాడు.
LPG Booking: హంతకుడికి చెక్ పెట్టిన 'సిలిండర్'.. నాలుగేళ్ల పరారీకి ఎండ్ కార్డ్..
LPG Booking: సినిమాల్లో మాదిరిగా ప్రతిసారి గుర్తింపు మారుస్తూ, పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న ఒక మాజీ ఆర్మీ కెప్టెన్ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. భార్యను హత్య చేసి నాలుగేళ్లుగా పరారీలో ఉన్న సందీప్ తోమర్‌ను పంజాబ్ పోలీసులు మధ్యప్రదేశ్‌లో అరెస్టు చేశారు. ఒక చిన్న గ్యాస్ సిలిండర్ బుకింగ్ ఆధారంగా పోలీసులు అతడి ఆచూకీని కనిపెట్టడం విశేషం.
సందీప్ తోమర్ 2013లో పంజాబ్‌లోని అబోహర్లో ఆర్మీ కెప్టెన్‌గా పనిచేస్తున్న సమయంలో తన భార్యను హత్య చేశాడు. తొలుత దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా, పోలీసు విచారణలో అది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని తేలింది. 2014లో ట్రయల్ కోర్టు అతడిని దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది.
2019లో బెయిల్ మీద బయటకు వచ్చిన తోమర్, 2022లో హైకోర్టు అతడి అప్పీల్‌ను కొట్టివేసినా లొంగిపోకుండా పరారయ్యాడు. అప్పటి నుంచి లొకేషన్లు మారుస్తూ పోలీసులకు చిక్కకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ క్రమంలో నిందితుడిని పట్టుకోవడానికి పంజాబ్ పోలీసులు ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు.
నిందితుడి పాన్ కార్డుతో అనుసంధానమై ఉన్న ఒక బ్యాంకు ఖాతాను పోలీసులు ఇటీవల గుర్తించారు. ఆ ఖాతా స్టేట్మెంట్ను పరిశీలించగా, మధ్యప్రదేశ్‌లోని పాంఢుర్నాలో ఒక ఎల్పీజీ సిలిండర్ బుక్ చేసినట్లు వెల్లడైంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సదరు గ్యాస్ ఏజెన్సీ నుంచి డెలివరీ అడ్రస్‌ను సేకరించారు. స్థానిక పోలీసుల సహాయంతో దాడి చేసి సందీప్ తోమర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రస్తుతం నిందితుడిని పంజాబ్‌కు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది.




