Euthanasia: ముగిసిన కారుణ్య మరణం పొందిన హరీష్ రాణా అంత్యక్రియలు

Euthanasia: సుప్రీం కోర్టు తీర్పుతో కారుణ్య మరణం పొందిన హరీష్ రాణా అంత్యక్రియలు ముగిశాయి. దేశంలో తొలి కారుణ్యమరణం ఇది.

KVD Varma
Published on: 25 March 2026 11:32 AM IST
Euthanasia: సుప్రీం కోర్టు తీర్పుతో కారుణ్య మరణం పొందిన హరీష్ రాణా అంత్యక్రియలు
X

Euthanasia

Euthanasia: మాటలకందని విషాదం అది. ఏ ఓదర్పూ శాంతింపచేయలేని వేదన అది. చేతికి అందిరావాల్సిన కొడుకును చితి మంటల్లోకి తమ చేతులతో తామే నెట్టివేసిన భరించలేని వేదన అది. అటువంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకూ రాకూడదనే ప్రార్థన అది. అంతులేని బాధను అదిమి పట్టుకుని.. కొడుకు అంత్యక్రియలకు వచ్చిన బంధువులు.. సన్నిహితులు.. స్థానికులను ఉద్దేశించి రెండు చేతులూ జోడించి ఆ తండ్రి ఏమని వేడుకున్నాడంటే..

“ఎవరూ ఏడవకండి.. నా కొడుకు శాంతితో జీవించాలని ప్రార్థిస్తున్నాను. అతను ఎక్కడ పుట్టినా దేవుడు అతన్ని దీవించుగాక.” ఇదీ కారుణ్యమరణంతో ఈ లోకాన్ని వదిలి పోయిన 31 ఏళ్ల హరీష్ రాణా అంత్యక్రియల సందర్భంగా అతని తండ్రి మాటలు.

కోర్టు నుంచి కారుణ్య మరణం అనుమతితో చివరి శ్వాస తీసుకున్న ఘజియాబాద్‌కు చెందిన హరీష్ రాణా అంత్యక్రియలు ఈరోజు (మార్చి 25) జరిగాయి. అతని తమ్ముడు ఆశిష్, బుధవారం ఉదయం 9:40 గంటలకు ఢిల్లీలోని గ్రీన్ పార్క్ శ్మశానవాటికలో చితికి నిప్పంటించాడు. అంతకుముందు, హరీష్ మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకువచ్చారు. అతని తండ్రి అశోక్ రాణా (62) తన కుమారుడికి చివరి నివాళులర్పించారు.

నిన్న హరీష్ తుదిశ్వస..

31 ఏళ్ల హరీష్, 13 ఏళ్లుగా కోమాలో ఉండి, నిన్న మార్చి 24న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. వైద్యుల ప్రకారం, హరీష్ ఊపిరితిత్తులు, రెండు మూత్రపిండాలు, కార్నియాలను అతని కుటుంబం దానం చేసింది. దీనివల్ల ఆరుగురికి కొత్త జీవితం లభిస్తుందని ఆశిస్తున్నారు.

ఏమిటీ కారుణ్య మరణం..

కారుణ్య మరణం మన దేశంలో తొలిసారిగా వినిపించిన పదం. ఎయిమ్స్‌లో హరీష్‌కు నిష్క్రియాత్మక కారుణ్య మరణం (పాసివ్ యూథనేషియా) అందించారు. దీని అర్థం ఏమిటంటే, తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగిని బ్రతికించడానికి అందిస్తున్న బాహ్య ప్రాణ రక్షణ సహాయాన్ని లేదా చికిత్సను ఆపివేయడం లేదా ఉపసంహరించుకోవడం. దీని వలన రోగి సహజంగా మరణించడానికి వీలు కలుగుతుంది. మార్చి 11వ తేదీన సుప్రీం కోర్టు హరీష్‌కు కారుణ్య మరణాన్ని మంజూరు చేసింది. దేశంలో కారుణ్య మరణం మంజూరు అయిన మొదటి కేసు ఇదే. మార్చి 14వ తేదీన హరీష్‌ను అతని ఘజియాబాద్ ఇంటి నుండి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. మార్చి 16వ తేదీన హరీష్‌కు అమర్చిన ఫీడింగ్ ట్యూబ్‌ను తొలగించారు.

హైకోర్టు నిరాకరించింది..

హరీష్ రాణా కుటుంబం తొలుత ఏప్రిల్ 3, 2024న కారుణ్య మరణానికి అనుమతి కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్‌ను దాఖలు చేసింది. అయితే, కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఆ కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు హరీష్ పరిస్థితిని విచారించి కారుణ్య మరణానికి అంగీకరిస్తూ తీర్పు చెప్పింది.

అంత్యక్రియల్లో ప్రముఖులు

హరీష్ అంత్యక్రియలకు యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ హాజరయ్యారు. "మేము ఆ కుటుంబానికి మద్దతుగా వచ్చాము. ఆ కుటుంబం ఆ బిడ్డకు 13 ఏళ్లుగా సేవ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా నిలుస్తుంది. ఈ కుటుంబం దేశానికి ఆదర్శంగా నిలిచింది" అని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

బ్రహ్మ కుమారి లవ్లీ కూడా తన సోదరీమణులతో కలిసి అంత్యక్రియలకు హాజరయ్యారు. ఘజియాబాద్‌లోని హరీష్ ఇంటి వద్ద అతనికి వీడ్కోలు పలికింది ఆమె. అతని నుదుటిపై ఆమె తిలకం దిద్దారు. ఆ సమయంలో ఆమె, "ఇప్పుడు అందరినీ క్షమించి, అందరి క్షమాపణలు కోరుతూ వెళ్ళు... ఫర్వాలేదు..." అని అన్నారు. బరువెక్కిన హృదయాలతో.. హరీష్ కు తుది వీడ్కోలు చెప్పారు అక్కడి ప్రజలు.

KVD Varma

KVD Varma

జర్నలిజం రంగంలో 18 ఏళ్ల సుదీర్ఘ అనుభవం నాది. 2008లో సాక్షి పత్రికలో రిపోర్టర్‌గా ప్రస్థానం ప్రారంభించి, ఆపై వివిధ పత్రికల్లో రిపోర్టర్ గా, బ్యూరో చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించాను. డిజిటల్ విప్లవంతో ఇటువైపు ప్రయాణంలో భాగంగా HMTVతో ప్రారంభించి TV9, RTV, Mahaa News వంటి అగ్రగామి సంస్థల్లో డిజిటల్ జర్నలిస్టుగా పనిచేశాను. ప్రస్తుతం HMTV వెబ్‌సైట్ వేదికగా పాఠకులకు తాజా వార్తలను అందిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తూ.. హిందీ, ఇంగ్లీష్ వార్తలను తెలుగు పాఠకుల అభిరుచికి అనుగుణంగా అనువదించి, విశ్లేషణాత్మక కథనాలను అందించడం నా ప్రత్యేకత.

Next Story