Tamil Nadu: 'కాబోయే సీఎం కనిమొళి'.. డీఎంకేలో మొదలైన వారసత్వ సమరం!

Tamil Nadu: డీఎంకేలో వారసత్వ పోరు. కనిమొళిని కాబోయే ముఖ్యమంత్రిగా అభివర్ణిస్తూ కార్యకర్తల నినాదాలు. ఉదయనిధి స్టాలిన్ పర్యటనల రద్దు వెనుక అసలు కారణం ఏంటి? తమిళ రాజకీయాల్లో తాజా పరిణామాలపై ప్రత్యేక కథనం.

Arun Chilukuri
Published on: 4 April 2026 12:07 PM IST
Tamil Nadu
X

Tamil Nadu: 'కాబోయే సీఎం కనిమొళి'.. డీఎంకేలో మొదలైన వారసత్వ సమరం!

DMK Succession War: తమిళనాడు అధికార పార్టీ డీఎంకేలో వారసత్వ రాజకీయం సరికొత్త మలుపు తిరుగుతోంది. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను వారసుడిగా తీర్చిదిద్దుతున్న తరుణంలో, ఎంపీ కనిమొళి మద్దతుదారులు చేసిన నినాదాలు పార్టీలో పెను సంచలనానికి తెరలేపాయి. తూత్తుక్కుడి ఎంపీగా, పార్లమెంటులో పార్టీ బలమైన గొంతుకగా పేరున్న కనిమొళిని 'కాబోయే ముఖ్యమంత్రి'గా అభివర్ణించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

నినాదాలతో దద్దరిల్లిన సభ:

ఇటీవల తిరునెల్వేలి జిల్లా పాళయంగోట్టయ్‌లో జరిగిన ప్రచార కార్యక్రమంలో కనిమొళి పాల్గొన్నారు. ఆమె వేదికపైకి వస్తున్న సమయంలో కార్యకర్తలు ఒక్కసారిగా "కాబోయే సీఎం కనిమొళి" అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ అనూహ్య పరిణామంతో ఆమె ఆశ్చర్యానికి లోనైనా, ఏమీ మాట్లాడకుండానే వేదిక వైపు వెళ్లిపోయారు.

కనిమొళి వర్సెస్ ఉదయనిధి?

పార్టీలో కనిమొళి ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అసంతృప్తి ఆమె మద్దతుదారుల్లో బలంగా కనిపిస్తోంది. దీనికి కొన్ని తాజా పరిణామాలే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

గత వారం తిరునెల్వేలి, కోవిల్‌పట్టిలో ఉదయనిధి పాల్గొనాల్సిన యువజన విభాగం సమావేశాలు చివరి నిమిషంలో రద్దయ్యాయి. కనిమొళిని ఈ సమావేశాలకు ఆహ్వానించకపోవడమే ఈ రద్దుకు కారణమని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

దక్షిణ తమిళనాడు బాధ్యతలను కనిమొళి పర్యవేక్షిస్తున్నప్పటికీ, ఆమెకు తెలియకుండానే అక్కడ ఉదయనిధి పర్యటనలు ప్లాన్ చేయడంపై ఆమె వర్గం గుర్రుగా ఉంది.

స్టాలిన్‌కు సవాలేనా?

కరుణానిధి కుమార్తెగా కనిమొళికి ఉన్న మాస్ ఫాలోయింగ్, ఆమె వాక్చాతుర్యం పార్టీకి పెద్ద అసెట్. అయితే, తన వారసుడిగా ఉదయనిధిని సిద్ధం చేస్తున్న స్టాలిన్‌కు, కనిమొళి మద్దతుదారుల నుంచి వస్తున్న ఈ డిమాండ్ మింగుడుపడటం లేదు. ఈ పరిణామాలు డీఎంకేలో అంతర్గత పోరుకు దారితీస్తాయా? లేక సర్దుబాటు జరుగుతుందా? అన్నది వేచి చూడాలి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story