జామకాయ కోసిందని చిన్నారిని గొలుసులతో బంధించిన మాజీ సైనికుడు!

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో దారుణం జరిగింది. జామకాయ కోసిందన్న నెపంతో ఒక చిన్నారిని మాజీ సైనికుడు గొలుసులతో బంధించి చిత్రహింసలకు గురిచేశాడు.

Arun Chilukuri
Published on: 6 April 2026 10:53 AM IST
Himachal Pradesh
X

జామకాయ కోసిందని చిన్నారిని గొలుసులతో బంధించిన మాజీ సైనికుడు!

Himachal Pradesh: సమాజంలో మానవత్వం రోజురోజుకూ మంటగలిసిపోతోంది. ఆకలితో ఉన్న ఓ చిన్నారి చేసిన చిన్న తప్పుకు ఒక మాజీ సైనికుడు అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. కేవలం ఒక జామకాయ కోసిందన్న కోపంతో ఆ బాలికను ఇనుప గొలుసులతో బంధించి చిత్రహింసలకు గురిచేసిన అమానవీయ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని ఊనా జిల్లాలో వెలుగుచూసింది.

అసలేం జరిగిందంటే?

వలస కూలీల కుటుంబానికి చెందిన ఒక చిన్నారి, ఆకలి వేయడంతో స్థానిక మాజీ సైనికుడి ఇంటి ముందున్న జామ చెట్టు నుంచి ఒక కాయను కోసింది. అది గమనించిన సదరు వ్యక్తి ఆగ్రహంతో ఊగిపోయాడు. చిన్నారి అని కూడా చూడకుండా ఆమెను పట్టుకుని మెట్ల దగ్గరున్న ఇనుప రాడ్డుకు గొలుసులతో బంధించాడు.

ఆ చిన్నారి భయంతో విలవిలలాడుతూ, తనను వదిలేయమని వేడుకుంటున్నా ఆ కరకు గుండె కరగలేదు. 'జామకాయలు దొంగతనం చేస్తావా?' అంటూ తన చర్యను సమర్థించుకుంటూ ఆమెను హింసించాడు.

యువకుడి సాహసంతో బయటపడ్డ నిజం:

రోహిత్ అనే యువకుడు ఈ దృశ్యాన్ని గమనించి సాహసంతో చిన్నారి దగ్గరకు వెళ్లాడు. ఆ సమయంలో ఆ పాప చేతులెత్తి దండం పెడుతూ తనను రక్షించమని ఏడుస్తూ వేడుకోవడం చూసి అందరి హృదయాలు ద్రవించిపోయాయి. వెంటనే రోహిత్ పోలీసులకు, చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు బాలికను గొలుసుల నుంచి విడిపించి రక్షించారు.

నెటిజన్ల ఆగ్రహం:

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "రూ. 5 ఖరీదు చేసే జామకాయ కోసం ఇంతటి క్రూరత్వమా?" అంటూ నెటిజన్లు సదరు మాజీ సైనికుడిపై దుమ్మెత్తిపోస్తున్నారు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి, బాధిత కుటుంబ సభ్యుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story