Commercial Gas: మధ్యతరగతి ప్రజలకు మరో మంట

Commercial Gas: జూన్ 1 నుండి దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి.

Naresh.k
Published on: 1 Jun 2026 8:46 AM IST
Commercial Gas
X

Commercial Gas: మధ్యతరగతి ప్రజలకు మరో మంట

Commercial Gas: హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న చిన్న ధాబాలు నడుపుకునే వ్యాపారస్తులకు చమురు సంస్థలు షాకిచ్చాయి. జూన్ ఒకటి అయిన ఈరోజు నుండి దేశవ్యాప్తంగా పందొమ్మిది కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు మరోసారి పెంచాయి.ఇది చిన్న పెంపే అయినప్పటికీ, గత కొన్ని నెలలుగా వరుసగా ధరలు పెరుగుతూ వస్తుండటంతో చిన్న తరహా వ్యాపారస్తులకు ఇది అదనపు భారంగా మారింది. అయితే, గృహ అవసరాలకు ఉపయోగించే పద్నాలుగు పాయింట్ రెండు కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరలలో ఎలాంటి మార్పు లేకపోవడం గృహిణులకు పెద్ద ఊరటనిచ్చే అంశం.

ఈ తాజా పెంపు తర్వాత దేశంలోని ప్రధాన నగరాల్లో పందొమ్మిది కిలోల కమర్షియల్ సిలిండర్ కొత్త ధరలు చాలా భారీగా కనిపిస్తున్నాయి. దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో సిలిండర్ ధర నలభై రెండు రూపాయలు పెరగడంతో, అక్కడ కొత్త ధర మూడు వేల నూట పదమూడు రూపాయల యాభై పైసలకు చేరింది. ఇక కోల్‌కతాలో గరిష్టంగా యాభై మూడు రూపాయల యాభై పైసలు పెరగడంతో, కొత్త ధర మూడు వేల,నాలుగు వందల యాభై ఐదు రూపాయల యాభై పైసలుగా నమోదైంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కమర్షియల్ సిలిండర్ ధర సుమారు మూడు వేల ఇరవై నాలుగు రూపాయలు దాటిపోయింది.

కమర్షియల్ గ్యాస్ ధరలు గత కొన్ని నెలలుగా నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మే నెలలో ఏకంగా తొమ్మిది వందల తొంభై మూడు రూపాయల వరకు భారీగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో వస్తున్న హెచ్చుతగ్గులు, పశ్చిమ ఆసియా ప్రాంతంలో నెలకొన్న తీవ్ర భౌగోళిక ఉద్రిక్తతలు మరియు అంతర్జాతీయ సప్లై చైన్‌లో తలెత్తుతున్న ఇబ్బందులే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా ఆర్థిక విశ్లేషకులు చెప్తున్నారు.

ఈ నిరంతర పెంపు ప్రభావం కేవలం వ్యాపారస్తులపైనే కాకుండా, పరోక్షంగా సామాన్య ప్రజలపై కూడా పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. హోటల్స్ , రెస్టారెంట్లలో నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల రాబోయే రోజుల్లో హోటళ్లలో ఆహార పదార్థాల ధరలు, టిఫిన్స్ మరియు భోజనాల రేట్లు కూడా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story