CJP Sansad Chalo : ఢిల్లీవ్యాప్తంగా BNSS సెక్షన్ 163 అమలు.. జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

CJP Sansad Chalo : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాకరోచ్ జనతా పార్టీ సంసద్ చలో పిలుపుతో ఉద్రిక్తత నెలకొంది.

CR Reddy
Published on: 20 July 2026 7:09 AM IST
CJP Sansad Chalo
X

CJP Sansad Chalo

CJP Sansad Chalo : దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాకరోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీపకే ఇచ్చిన పిలుపు మేరకు రాత్రంతా ధర్నా స్థలంలోనే భారీ సంఖ్యలో నిరసనకారులు తిష్టవేశారు. ఈ రోజు వారు తలపెట్టిన సంసద్ మార్చ్ నేపథ్యంలో జంతర్ మంతర్ అంతటా పెద్ద ఎత్తున బ్యానర్లు వెలిశాయి. నిరసనకారుల నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోతోంది. ఈ మార్చ్ కారణంగా ఢిల్లీ పోలీసులు హై అలర్ట్ ప్రకటించి భారీగా బలగాలను మోహరించారు.

ఢిల్లీవ్యాప్తంగా BNSS సెక్షన్ 163 అమలు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడంతో పాటు ఈ మార్చ్ పిలుపు ఉండటంతో న్యూఢిల్లీ జిల్లా వ్యాప్తంగా భద్రతను విపరీతంగా పెంచేశారు. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపు వెళ్లే మార్గాల్లో పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ మార్చ్‌కు ఎలాంటి అధికారిక అనుమతి లభించలేదని, ఒకవేళ ప్రదర్శనకారులు పార్లమెంట్ వైపు దూసుకురావడానికి ప్రయత్నిస్తే వారిని అడ్డుకుని చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ప్రస్తుతం భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) సెక్షన్ 163 అమలులో ఉందని, ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒకచోట కూడటం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.

కేంద్ర విద్యుత్, విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్

జంతర్ మంతర్ వద్దకు చేరుకున్న సిజెపి కార్యకర్తలు, మద్దతుదారులు విద్యావ్యవస్థలో మార్పులు రావాలని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ పార్లమెంట్ వైపు ర్యాలీ చేయాలని ఇచ్చిన పిలుపును తాము ఖచ్చితంగా పాటిస్తామని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ ఆందోళనకు పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు కూడా తమ మద్దతు తెలిపారు.

హాస్పిటల్‌లో సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష

మరోవైపు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో ఈ అంశంపై మాట్లాడుతూ ఒక కీలక ప్రకటన చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విద్యావ్యవస్థ జవాబుదారీతనంపై చర్చ జరుపుతామని నాయకులు ఆసుపత్రికి వచ్చి వాంగ్‌చుక్‌కు గ్యారెంటీ ఇస్తేనే ఆయన తన దీక్షను విరమిస్తారని స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

జంతర్ మంతర్ పరిసరాల్లో 20 వేల మంది ప్రదర్శనకారులు

సిజెపి ముఖ్య అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఈ ఆందోళన తీవ్రతపై సోషల్ మీడియా వేదికగా కీలక విషయాలు వెల్లడించారు. జంతర్ మంతర్ మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికే దాదాపు 20 వేల మందికి పైగా నిరసనకారులు చేరుకున్నారని ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. "ధర్మేంద్ర ప్రధాన్ గారూ.. ఇప్పుడు జవాబుదారీతనం నిర్ణయించాల్సిన సమయం వచ్చింది" అంటూ ఆయన పేర్కొన్నారు. వేలాదిగా జనం తరలిరావడంతో ఢిల్లీ పోలీసులు ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story