Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు హ్యాక్..
Cockroach Janata Party: సోషల్ మీడియాలో యువతకు ఎంతగానో కనెక్ట్ అయిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) అకౌంట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి.
Cockroach Janata Party: యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఫేమస్ సోషల్ మీడియా పేజీ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ - CJP) కి పెద్ద షాక్ తగిలింది. ఈ పార్టీ సోషల్ మీడియా ఖాతాలపై మళ్లీ డిజిటల్ దాడులు మొదలయ్యాయని, తమను అణచివేసే కుట్ర జరుగుతోందని పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే సంచలన ఆరోపణలు చేశారు. తన వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్ ఖాతాతో పాటు, పార్టీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీ కూడా హ్యాక్‌కు గురైందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఈ రెండు అకౌంట్లపై తాము పూర్తిగా నియంత్రణ కోల్పోయామని స్పష్టం చేశారు.
హ్యాక్ అయిన అకౌంట్లను పునరుద్ధరించడానికి (Recovery) తాము చేసిన ప్రయత్నాలేవీ ఫలించడం లేదని అభిజిత్ దిప్కే ఆవేదన వ్యక్తం చేశారు. మెటా (Meta) రికవరీ ప్రాసెస్‌ను ఉపయోగించిన ప్రతిసారీ, సెక్యూరిటీ కారణాల వల్ల ఖాతాలను లాక్ చేసినట్లు స్క్రీన్‌పై మెసేజ్ వస్తోందని ఆయన తెలిపారు. గుర్తింపును నిరూపించుకుని, కొత్త పాస్‌వర్డ్ సెట్ చేసుకోవాలని సూచిస్తున్నప్పటికీ.. ఎన్నిసార్లు ట్రై చేసినా అదే ఎర్రర్ సమాధానం వస్తోందని దానికి సంబంధించిన స్క్రీన్‌షాట్లను ఆయన షేర్ చేశారు.
ఈ పరిణామాలపై అభిజిత్ దిప్కే ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తీవ్రంగా స్పందించారు. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ని టార్గెట్ చేస్తూ వ్యవస్థీకృతంగా అణచివేత సాగుతోందని మండిపడ్డారు. ప్రధాన ఖాతాలతో పాటు బ్యాకప్ కోసం క్రియేట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పేజీని కూడా కాసేపు డిలీట్ చేశారని ఆరోపించారు. ప్రస్తుతం తమ ప్లాట్‌ఫామ్‌లు వేటికీ తమకు యాక్సెస్ లేదని తేల్చి చెప్పారు.
ఖాతాలు హ్యాకర్ల చేతుల్లోకి మారడంతో అభిజిత్ తన మద్దతుదారులను, ఫాలోవర్లను అప్రమత్తం చేశారు. ఇప్పటి నుంచి ఆయా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో వచ్చే ఏ పోస్టును కూడా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ అధికారిక ప్రకటనగా భావించవద్దని కోరారు.
గతంలోనే ఈ పార్టీకి చెందిన ప్రధాన ‘ఎక్స్’ (ట్విట్టర్) అకౌంట్‌ను భారత్‌లో నిలిపివేశారని (Withheld) ఆయన గుర్తు చేశారు. అయితే, ఆ వెంటనే తాము ‘కాక్రోచ్ ఈజ్ బ్యాక్’ (Cockroach Is Back) పేరుతో కొత్త ఖాతాను తెరిచి విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చామని, ఇప్పుడు ఇన్‌స్టా పేజీలను టార్గెట్ చేయడం దారుణమని అభిజిత్ దిప్కే పేర్కొన్నారు.




