CM Vijay: థియేటర్లకు భారీ ఊరట ఇచ్చిన సీఎం విజయ్

CM Joseph Vijay: తమిళ సూపర్ స్టార్, తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సినీ పరిశ్రమకు ఊరటనిచ్చేలా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Srinivas Rao
Published on: 26 May 2026 3:56 PM IST
CM Vijay
X

CM Vijay: థియేటర్లకు భారీ ఊరట ఇచ్చిన సీఎం విజయ్

CM Joseph Vijay: తమిళ సూపర్ స్టార్, తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సినీ పరిశ్రమకు ఊరటనిచ్చేలా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓటీటీ విప్లవం తర్వాత థియేట్రికల్ రెవెన్యూను పెంచడం ఎలా? చిత్ర పరిశ్రమను సంక్షోభం నుండి ఎలా గట్టెక్కించాలి? అనే విషయాలపై ఇటీవలే కోలీవుడ్ సినీ ప్రముఖులు ముఖ్యమంత్రితో భేటీ అయి పలు ప్రతిపాదనలు సమర్పించారు. పరిశ్రమ వర్గాల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన సీఎం విజయ్.. కొత్తగా విడుదలయ్యే చిత్రాల మొదటి వారం రోజుల్లో రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు అధికారికంగా అనుమతినిచ్చారు.

అధికారిక ఎక్స్ (X) ఖాతా ద్వారా ప్రకటన

సినిమా టికెట్ల బుకింగ్స్ ఆలస్యం కావడం, షో టైమింగ్స్ విషయంలో నెలకొంటున్న అనిశ్చితిని తొలగిస్తూ ముఖ్యమంత్రి విజయ్ తన అధికారిక సీఎం ఎక్స్ (గతంలో ట్విట్టర్) హ్యాండిల్ ద్వారా ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు.

“మే 16, 2026 న తమిళ చిత్ర పరిశ్రమ ప్రతినిధులు నన్ను కలిసి పలు డిమాండ్లను సమర్పించారు. అందులో ముఖ్యంగా తమిళనాడు అంతటా కొత్త సినిమాలకు రోజుకు ఐదు షోల ప్రదర్శనకు అనుమతించాలని కోరారు. వారి విజ్ఞప్తిని పరిశీలించి, తమిళనాడు సినిమా థియేటర్ల (రెగ్యులేషన్) నిబంధనలను సవరిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాం” అని సీఎం నోట్‌లో పేర్కొన్నారు.

https://twitter.com/CMOTamilnadu/status/2058889168353464632

నిబంధనల్లో కీలక మార్పులు ఇవే:

నూతన సవరణల ప్రకారం ప్రభుత్వం థియేటర్ల యజమానులకు, నిర్మాతలకు భారీ ఊరటనిచ్చింది. తమిళనాడులోని అన్ని థియేటర్లు కొత్తగా విడుదలయ్యే చిత్రాలకు మొదటి 7 రోజుల పాటు రోజుకు 5 షోలు ప్రదర్శించుకోవచ్చు. స్థానిక పండుగలు, ప్రభుత్వ సెలవు దినాలు శని, ఆదివారాలలో కూడా 5 షోల ప్రదర్శనకు శాశ్వత అనుమతి ఉంటుంది. అత్యంత కీలకమైన మార్పు ఏమిటంటే, ఈ 5 షోల ప్రదర్శన కోసం నిర్మాతలు ఇకపై ప్రభుత్వం నుండి లేదా లైసెన్సింగ్ అధికారుల నుండి ఎలాంటి ప్రత్యేక అనుమతులు పొందాల్సిన అవసరం లేదు.

1957 నాటి పాత నిబంధనలకు స్వస్తి

గతంలో అమలులో ఉన్న 'తమిళనాడు సినిమా థియేటర్స్ (రెగ్యులేషన్) రూల్స్, 1957' లోని కండిషన్ 14-A ప్రకారం థియేటర్లలో రోజుకు కేవలం నాలుగు షోలకు మాత్రమే అనుమతి ఉండేది. పండుగ రోజుల్లో అదనపు షో కావాలంటే చెన్నైలో పోలీస్ కమిషనర్ నుండి, జిల్లాల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుండి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి వచ్చేది. దీనివల్ల ప్రదర్శనల సమయంలో తీవ్ర గందరగోళం నెలకొనేది.

ఇదిలా ఉంటే, నటుడిగా సీఎం విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగన్’ జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాను నటించిన చివరి సినిమా విడుదలకు ముందే, పరిశ్రమ బాగుకోసం విజయ్ ఈ జీవోను తీసుకురావడం పట్ల కోలీవుడ్ నిర్మాతలు, ఎగ్జిబిటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story