Indian Railways: రైల్వే స్టేషన్లలో నీళ్లు తాగుతున్నారా? సంచలన రిపోర్టు ఇదిగో!
Indian Railways: ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడంలో రైల్వే జోన్లు ఫెయిలయ్యాయని సీఏజీ ఎండగట్టింది.
Indian Railways: రైల్వే స్టేషన్లలో నీళ్లు తాగుతున్నారా? సంచలన రిపోర్టు ఇదిగో!
Indian Railways: ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడంలో రైల్వే జోన్లు ఫెయిలయ్యాయని సీఏజీ ఎండగట్టింది. డ్రింకింగ్ వాటర్‌లో ప్రమాదకర ఈ-కోలి బ్యాక్టీరియా ఉందని వెల్లడించింది.
రైళ్లలో ప్రయాణించే సమయంలో ఎంతో మంది ప్రయాణికులు రైల్వే స్టేషన్లలో లభించే నీటిని తాగుతుంటారు. అయితే ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించడంలో వివిధ రైల్వే జోన్లు పూర్తిగా విఫలమయ్యాయని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) స్పష్టం చేసింది. ఈ మేరకు పార్లమెంటుకు ఇటీవల సమర్పించిన నివేదికలో రైల్వే స్టేషన్ల దుస్థితిని ఎండగట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న పలు స్టేషన్లలో ప్రయాణికుల భద్రత, శుభ్రత గాలికి కొట్టుకుపోతున్నాయని నివేదికలో పేర్కొంది.
దేశంలోని సుమారు 56 రైల్వే స్టేషన్లలో నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించగా దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డ్రింకింగ్ వాటర్‌లో ప్రమాదకరమైన ఈ-కోలి బ్యాక్టీరియా ఉన్నట్లు సీఏజీ తేల్చింది. ఈ జాబితాలో హైదరాబాద్ స్టేషన్ కూడా ఉండటం గమనార్హం. కేవలం తాగునీరు మాత్రమే కాకుండా స్టేషన్‌లలోని వాష్ రూమ్‌లు కూడా అత్యంత అపరిశుభ్రంగా ఉన్నాయని నివేదిక వెల్లడించింది. ప్రయాణికులు వినియోగించే ప్రాంతాల్లో పరిశుభ్రత లోపించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
కలుషితమైన నీటిని సేవించడం వల్ల మానవ ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావం పడుతుంది. ఈ బ్యాక్టీరియా కారణంగా ప్రజలకు తీవ్రమైన కడుపునొప్పి, విరేచనాలు, వాంతులు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రయాణికుల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత రైల్వే శాఖపై ఉంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని సీఏజీ తన నివేదిక ద్వారా స్పష్టం చేసింది.
రైల్వే స్టేషన్లలో మౌలిక వసతుల కల్పనకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపించడం వల్ల ఇలాంటి సమస్యలు పునరావృతమవుతున్నాయి. ప్రయాణికుల ఆరోగ్యంతో చెలగాటమాడే ఇలాంటి అంశాలపై రైల్వే అధికారులు వెంటనే స్పందించాలని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కలుషిత నీటి సమస్యను పరిష్కరించడానికి, వాష్ రూమ్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.




