Pre-Wedding Shoot: కాబోయే భార్య బర్త్‌డే అంటే ఇష్టంగా వెళ్లాడు.. చివరకు
Pre-Wedding Shoot: మహారాష్ట్రలోని లోహగడ్ కోట వద్ద యువ పారిశ్రామికవేత్త కేతన్ అగ్రవాల్ మృతి కేసు సంచలన మలుపు తిరిగింది.
Pre-Wedding Shoot: కాబోయే భార్య బర్త్‌డే అంటే ఇష్టంగా వెళ్లాడు.. చివరకు
Pre-Wedding Shoot: మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన ఇద్దరు పెద్దల సమక్షంలో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. పెళ్లి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి, అతిథుల కోసం ఏకంగా రెండు ప్రత్యేక విమానాలను కూడా బుక్ చేశారు. అంతా సంతోషంగా సాగిపోతుందనుకున్న తరుణంలో ఒక ఊహించని మలుపు. ప్రీవెడ్డింగ్ ఫొటో షూట్ కోసం వెళ్లిన కాబోయే వరుడు లోయలో పడి శవమయ్యాడు. మొదట ప్రమాదం అనుకున్న ఈ ఘటన వెనుక దాగిన సస్పెన్స్ థ్రిల్లర్ లాంటి హత్య ఉదంతం బయటపడటంతో దేశవ్యాప్తంగా కలకలం రేగుతోంది.
మహారాష్ట్రకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త విశాల్ అగ్రవాల్ కుమారుడు కేతన్ అగ్రవాల్‌కు, ప్రముఖ మసాలా వ్యాపారవేత్త కుమార్తె సియా గోయల్‌కు వివాహం నిశ్చయమైంది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో అత్యంత వైభవంగా వీరి పెళ్లి జరగాల్సి ఉంది. ఈ క్రమంలో, సియా గోయల్ పుట్టినరోజు సందర్భంగా ఆమెతో కలిసి కేతన్ లోహగడ్ కోటకు వెళ్లాడు. అక్కడ ట్రెక్కింగ్‌తో పాటు ప్రీవెడ్డింగ్ ఫొటో షూట్ కూడా ప్లాన్ చేసుకున్నారు.
ట్రెక్కింగ్ ముగించుకుని కొండ అంచున ఫోటోలు దిగుతున్న సమయంలో కేతన్ అగ్రవాల్ కాలు జారి లోయలో పడిపోయాడంటూ ఒక్కసారిగా కేకలు వినిపించాయి. కట్ చేస్తే, కేతన్ లోయలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా అందరూ నమ్మే ప్రయత్నం చేశారు. కేసు నమోదు చేసుకున్న లోణావాలా గ్రామీణ పోలీసులు ఈ ఘటనపై అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. అయితే, కొండపై లభించిన ఆధారాలు, సియా ప్రవర్తన పోలీసులకు తీవ్ర అనుమానాలను రేకెత్తించాయి. కేతన్ కాలు జారి పడిపోలేదని, అతడిని ఎవరో ఉద్దేశపూర్వకంగానే లోయలోకి నెట్టేసి హత్య చేశారని ఇన్వెస్టిగేషన్‌లో తేలింది.
మరింత లోతుగా విచారించగా, ఈ కథలోకి సియా గోయల్ రహస్య ప్రియుడు ఎంట్రీ ఇచ్చాడు. సియాకు అత్యంత సన్నిహితుడైన ఒక యువకుడు కూడా అదే సమయంలో అక్కడ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సియాకు కేతన్‌తో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, అందుకే తన ప్రియుడితో కలిసి కేతన్‌ను వదిలించుకోవాలని స్కెచ్ వేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ప్లాన్ ప్రకారం ఫోటో షూట్ పేరుతో కొండ అంచుకు తీసుకెళ్లి, వెనుక నుంచి కేతన్‌ను లోయలోకి తోసి కిరాతకంగా హతమార్చారు.
ప్రస్తుతం సియా గోయల్‌తో పాటు ఆమెకు సహకరించిన ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారిస్తున్నారు. పెళ్లి పీటలెక్కాల్సిన వధువే ప్రియుడితో కలిసి కాబోయే భర్తను లోయలోకి తోయించిన ఉదంతం మహారాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నమ్మకద్రోహం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు విచారణను వేగవంతం చేశారు.




