BJP: బీజేపీ నూతన జాతీయ కార్యవర్గం ప్రకటన.. పురందేశ్వరికి ఉపాధ్యక్ష పదవి!
BJP: రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు.
BJP: బీజేపీ నూతన జాతీయ కార్యవర్గం ప్రకటన.. పురందేశ్వరికి ఉపాధ్యక్ష పదవి!
BJP: వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సమరశంఖం పూరించింది. ఉత్తరప్రదేశ్‌లో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో విజయం సాధించడమే ధ్యేయంగా కమలనాథులు ముమ్మరంగా కసరత్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పార్టీ సంస్థాగత వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు.
నూతన కార్యవర్గంలో దేశవ్యాప్తంగా 13 మంది సీనియర్ నాయకులకు జాతీయ ఉపాధ్యక్ష పదవులు లభించాయి. ఇందులో రాజమండ్రి ఎంపీ, ఏపీ సీనియర్ నేత దగ్గుబాటి పురందేశ్వరికి జాతీయ ఉపాధ్యక్షురాలిగా చోటు దక్కింది. ఆమెతో పాటు వసుంధర రాజే సింధియా, తీరత్ సింగ్ రావత్, రామ్ మాధవ్, బైజయంత్ జయ్ పాండా, రేఖా వర్మ, వర్షాబెన్ నరేంద్రభాయ్ దోషి, భారతి ప్రవీణ్ పవార్, మన్‌ప్రీత్ సింగ్ బాదల్, లాల్ సింగ్ ఆర్య, ఎం. నాగరాజ, తారిఖ్ మన్సూర్, మధుచంద్ర కర్లను జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించారు.
పార్టీ సంస్థాగత వ్యవహారాలను పర్యవేక్షించే అత్యంత కీలకమైన జాతీయ ప్రధాన కార్యదర్శులుగా వినోద్ తావ్డే, స్మృతి ఇరానీలను నియమించారు. అలాగే, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ బాధ్యతలను మరోసారి బి.ఎల్. సంతోష్‌కే అప్పగించారు.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను బీజేపీ జాతీయ కోశాధికారిగా నియమించారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విష్ణువర్ధన్‌రెడ్డికి పార్టీలోని అన్ని సెల్స్ జాయింట్ కోఆర్డినేటర్‌గా కీలక బాధ్యత అప్పగించారు. ఈ కొత్త ఆఫీస్ బేరర్ల నియామకంతో రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను మెరుగుపరచడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది.




