పాఠశాల మునిగిపోతే ఏంటి? బోటునే బడిగా మార్చి పిల్లలకు చదువు చెబుతున్న మాస్టారు
Bihar: బిహార్‌లో భారీ వరదల కారణంగా చదువు కోల్పోతున్న విద్యార్థుల కోసం ఉపాధ్యాయుడు మహమ్మద్ సాహెబ్ వినూత్నంగా బోటులోనే బడి నిర్వహిస్తున్నారు.
పాఠశాల మునిగిపోతే ఏంటి? బోటునే బడిగా మార్చి పిల్లలకు చదువు చెబుతున్న మాస్టారు
Bihar: బిహార్‌లో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అనేక గ్రామాలు నీటమునిగాయి. ఈ భారీ వరదల నేపథ్యంలో విద్యార్థులు స్కూళ్లకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యకు కఠిహార్ జిల్లాలోని రఘునాథ్‌పుర్‌కు చెందిన ఉపాధ్యాయుడు మహమ్మద్ సాహెబ్ వినూత్న ఆలోచన చేశారు. చదువుకు ఎటువంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఏకంగా ఓ బోటునే స్కూల్‌గా మార్చేశారు.
తల్లిదండ్రుల అనుమతితో వరద ప్రభావిత ప్రాంతాల విద్యార్థులను ప్రతిరోజూ నీటి మట్టం తక్కువ ఉన్న ప్రాంతానికి బోటులోనే తీసుకువెళ్లి, అందులోనే పాఠాలు బోధిస్తున్నారు. పాఠశాల సమయం ముగిసిన అనంతరం విద్యార్థులను మళ్లీ సురక్షితంగా వారి ఇళ్ల వద్ద వదిలిపెడుతున్నారు. కేవలం సాధారణ పాఠాలే కాకుండా, పడవలోనే వివిధ కోచింగ్ క్లాస్‌లు కూడా నిర్వహిస్తుండటం విశేషం.
ఒకేసారి ఎక్కువ మంది విద్యార్థులను ఎక్కించుకోకుండా, భద్రతను దృష్టిలో ఉంచుకుని విడతల వారీగా బోటులో పాఠాలు చెబుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా చదువు ఆగిపోకూడదనే స్పూర్తితో ఆయన చేస్తున్న ఈ ప్రయత్నాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.




