Data Usage: రీల్స్ చూడటంలో బీహార్ వాళ్లే తోపులు.. డేటా వాడకంలోనూ వాళ్లదే రికార్డు
Data Usage: స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ వాడకం మన దేశంలో రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతోంది.
Data Usage
Data Usage: స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ వాడకం మన దేశంలో రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతోంది. సోషల్ మీడియాలో రీల్స్ చూడటం, వీడియోలు స్ట్రీమింగ్ చేయడం వంటి వాటిపై భారతీయులు ఎక్కువగా సమయం కేటాయిస్తున్నారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (TRAI) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ఇంటర్నెట్ డేటా వినియోగంలో బీహార్ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. తక్కువ టెలీ-డెన్సిటీ ఉన్నప్పటికీ, డేటా వాడకంలో బీహార్ ప్రజలు అందరికంటే ముందుండటం విశేషం.
అత్యధిక డేటా వినియోగిస్తున్న రాష్ట్రాలు
టెలికాం రంగ నివేదికల ప్రకారం, బీహార్ సర్కిల్‌లో రోజూ దాదాపు 49.1 పెటాబైట్ల (సుమారు 5 కోట్ల 14 లక్షల జీబీ) డేటా ఖర్చవుతోంది. ఈ జాబితాలో మహారాష్ట్ర 48.7 పెటాబైట్లతో రెండో స్థానంలో నిలవగా, ఉత్తరప్రదేశ్ (ఈస్ట్) 42.31 పెటాబైట్లతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత వరుసగా గుజరాత్ (42.2 పీబీ), మధ్యప్రదేశ్ (41.3 పీబీ) రాష్ట్రాలు ఉన్నాయి. బీహార్‌లో ఫోన్ కనెక్షన్‌ల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ నెట్‌ను ఉపయోగిస్తున్న వారు మాత్రం విపరీతంగా డేటాను ఖర్చు చేస్తూ రీల్స్ చూడటంలో అగ్రభాగాన నిలిచారు.
ఏ యాప్‌లలో ఎక్కువ డేటా ఖర్చవుతోంది?
దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారుల మొదటి ఎంపికగా యూట్యూబ్ నిలిచింది. మొత్తం ఇంటర్నెట్ డేటా వాడకంలో కేవలం యూట్యూబ్ ఒక్కటే 24.3 శాతం వాటాను కలిగి ఉంది. ఇక ఇన్‌స్టాగ్రామ్ 21.7 శాతంతో రెండో స్థానంలో, ఫేస్‌బుక్ 17.5 శాతంతో మూడో స్థానంలో ఉన్నాయి. వీటితో పాటు గూగుల్ సెర్చింగ్, ఇతర ఆన్‌లైన్ కార్యకలాపాలు (5.2 శాతం), వాట్సాప్ (3.5 శాతం) తదితర యాప్‌లలో కూడా భారీగా డేటా ఖర్చవుతోంది. ముఖ్యంగా వీడియో స్ట్రీమింగ్, సోషల్ మీడియా రీల్స్ మరియు ఫొటోలు స్క్రోల్ చేయడమే డేటా త్వరగా అయిపోవడానికి ప్రధాన కారణాలుగా మారాఋు.
సగటున ఎంత డేటా ఖర్చవుతోంది?
ఎరిక్సన్ సంస్థ విడుదల చేసిన మొబిలిటీ నివేదిక ప్రకారం.. భారతదేశంలో ప్రతీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుడు సగటున నెలకు 37 జీబీ డేటాను ఖర్చు చేస్తున్నాడు. రాబోయే ఐదేళ్లలో ఈ సగటు వినియోగం ఏకంగా 70 జీబీకి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి రావడం, తక్కువ ధరకే డేటా లభించడం వల్ల ప్రజలు ఇంటర్నెట్‌ను విరివిగా వాడుతున్నారు. జూలై నాటికి దేశంలో బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య భారీగా పెరిగింది, ఇది భవిష్యత్తులో డేటా వినియోగం మరింత పెరిగేందుకు సంకేతంగా చెప్పవచ్చు.




