Lalu Prasad Yadav: లాలూ ఇంటి వద్ద కర్రలతో ఆర్జేడీ నేతల కాపలా.. భద్రత ఉపసంహరణపై లాలూ ఫ్యామిలీ తీవ్ర నిరసన!
Lalu Prasad Yadav: బిహార్‌లో తీవ్ర రాజకీయ కలకలం రేగింది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవిలకు ఉన్న జెడ్ ప్లస్ (Z+) భద్రతను నితీష్ కుమార్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
Lalu Prasad Yadav: లాలూ ఇంటి వద్ద కర్రలతో ఆర్జేడీ నేతల కాపలా.. భద్రత ఉపసంహరణపై లాలూ ఫ్యామిలీ తీవ్ర నిరసన!
Lalu Prasad Yadav: బిహార్ రాజకీయం భద్రత (Security) చుట్టూ తిరుగుతోంది. రాష్ట్రీయ జనతా దళ్ (RJD) సుప్రీమో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి, బిహార్ ప్రభుత్వానికి మధ్య సెక్యూరిటీ వివాదం తీవ్రస్థాయికి చేరింది. లాలూ ప్రసాద్, ఆయన భార్య రబ్రీదేవిలకు దశాబ్దాలుగా ఉన్న అత్యున్నత 'జెడ్ ప్లస్' (Z+) కేటగిరీ భద్రతను రాష్ట్ర ప్రభుత్వం హఠాత్తుగా ఉపసంహరించుకోవడం ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది.
జెడ్ ప్లస్ సెక్యూరిటీని తొలగించిన ప్రభుత్వం.. ఆ స్థానంలో బిహార్ ప్రత్యేక సాయుధ పోలీసులతో సాధారణ భద్రతను ఏర్పాటు చేసింది. అయితే, ప్రభుత్వ చర్యను అవమానంగా భావించిన లాలూ కుటుంబం.. తమకు ఈ అరకొర భద్రత అస్సలు వద్దంటూ సదరు పోలీసు సిబ్బందిని తమ నివాసం నుంచి వెంటనే వెనక్కి పంపించివేసింది. ఈ పరిణామంతో పట్నాలోని 10- సర్క్యులర్ రోడ్‌లో ఉన్న లాలూ యాదవ్ నివాసం వద్ద భద్రత శూన్యమైంది. దీంతో తమ నాయకుడికి రక్షణగా ఆర్జేడీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలే స్వయంగా చేతుల్లో పెద్ద పెద్ద కర్రలు పట్టుకుని గేటు ముందు కాపలా కాస్తుండటం గమనార్హం. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
మరోవైపు లాలూ కుమారుడు, బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌కు ఉన్న 'వై-ప్లస్' (Y+) భద్రతను, అలాగే ఎంపీ మిసా భారతికి ఉన్న సెక్యూరిటీని యథావిధిగా కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కానీ, లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌కు ఉన్న వై-ప్లస్ భద్రతను తొలగించి కేవలం ఒకే ఒక్క కానిస్టేబుల్‌ను కేటాయించింది.
తన తల్లిదండ్రులు, సోదరుడి పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడంపై తేజస్వీ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా తనకు కేటాయించిన అధికారిక వై-కేటగిరీ భద్రతను కూడా ఆయన తక్షణమే ప్రభుత్వానికి వెనక్కి పంపించేశారు.
ఈ వ్యవహారంలో లాలూ కుమార్తె రోహిణి ఆచార్య ప్రభుత్వ పెద్దలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. "మా కుటుంబానికి ఎలాగైనా సరే హాని కలిగించాలనే దురుద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం కావాలని జెడ్ ప్లస్ సెక్యూరిటీని తొలగించింది. బిహార్‌కు తొలి మహిళా ముఖ్యమంత్రిగా సేవలు అందించిన నా తల్లి రబ్రీదేవి పట్ల ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారు."
ఈ నిరసన కేవలం లాలూ కుటుంబంతోనే ఆగదని.. ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్రంలోని మిగతా ఆర్జేడీ ముఖ్యాధికారులకు, నేతలకు ఉన్న ప్రభుత్వ భద్రతను కూడా త్వరలోనే వెనక్కి పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పార్టీ అధికార ప్రతినిధి శక్తి యాదవ్ స్పష్టం చేశారు.




