Bihar DSP Assets Scam: పనిమనిషి పేర కోటిరూపాయల ఆస్తి...థార్‌ కారులో పనికి

Bihar DSP Assets Scam: ప్రజలకు అండగా ఉండాల్సిన పోలీసులు అక్రమ సంపాదనకోసం అడ్డదారులు తొక్కి కోట్లాది రూపాయలు కూడబెడితే...ఏదో ఒకరోజు చట్టానికి చిక్కకుండా ఉండరు. ఇలాంటి వాటిల్లో ఒకటి బీహార్‌లోని ఓ డీఎస్పీ అక్రమాస్తుల కేసు.

Balachander
Updated on: 6 April 2026 11:35 AM IST
Bihar DSP Assets Scam
X

Bihar DSP Assets Scam: పనిమనిషి పేర కోటిరూపాయల ఆస్తి...థార్‌ కారులో పనికి

Bihar DSP Assets Scam: ప్రజలకు అండగా ఉండాల్సిన పోలీసులు అక్రమ సంపాదనకోసం అడ్డదారులు తొక్కి కోట్లాది రూపాయలు కూడబెడితే...ఏదో ఒకరోజు చట్టానికి చిక్కకుండా ఉండరు. ఇలాంటి వాటిల్లో ఒకటి బీహార్‌లోని ఓ డీఎస్పీ అక్రమాస్తుల కేసు. అక్రమంగా రూ. 80 కోట్లకు పైగా కూడబెట్టిన డీఎస్పీ గౌతమ్‌ కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. అయితే, ఈ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ముఖ్యంగా ఆయన పనిమనిషి పేరిట కోట్లాది రూపాయల ఆస్తులు కొనుగోలు చేసి విషయం డయటకు రావడంతో ఈ కేసు మరింత చర్చనీయాంశంగా మారింది.

కేసులో కొత్తమలుపు

ఆర్థిక నేరాల విభాగం అధికారులు కిషన్‌గంజ్‌లో నిర్వహించిన సోదాల్లో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గౌతమ్ కుమార్ తన భార్య రూబీ కశ్యప్, గర్ల్‌ఫ్రెండ్, అత్త పూనమ్ దేవి, కుమారుడు సిద్ధార్థ గౌతమ్ పేర్లతో పాటు పనిమనిషి పారో అలియాస్ పూజ పేరిట కూడా ఆస్తులు నమోదు చేసినట్లు తేలింది. మొత్తం 16 ప్లాట్లు, పలుచోట్ల విలువైన భూములు, బంగ్లాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో అత్యంత ఆశ్చర్యకరమైన అంశం పనిమనిషి జీవనశైలి. సాధారణంగా ఇంటి పనులు చేసే మహిళగా ఉన్న పారో.. రూ.35 లక్షల విలువైన థార్ కారులో పని కోసం రావడం అధికారులను షాక్‌కు గురిచేసింది. కొన్ని సందర్భాల్లో డీఎస్పీ అధికారిక వాహనాన్ని కూడా ఆమె వినియోగించినట్లు సమాచారం. అంతేకాకుండా ఆమెకు బుల్లెట్ బైక్, బెంగాల్‌లోని నార్త్ దినాజ్‌పూర్ సమీపంలో కోటి రూపాయల విలువైన ఇల్లు కూడా ఉన్నట్లు విచారణలో బయటపడింది. ఇంతటి ఆస్తులు ఒక పనిమనిషి పేరిట ఉండటంతో, ఆస్తుల అసలు యజమాని ఎవరు అనే అంశంపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. పోలీసు అధికారి తన అక్రమ సంపాదనను దాచిపెట్టడానికి ఈ విధానాన్ని అనుసరించినట్లు ఈఓయూ అధికారులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా గౌతమ్ కుమార్ తన గర్ల్‌ఫ్రెండ్ పేరిట ఏడు ప్లాట్లు కొనుగోలు చేసినట్లు కూడా వెల్లడైంది.

పలు చోట్ల పెట్టుబడులు

ఈ కేసు విచారణలో మరో కీలక విషయం బయటపడింది. గౌతమ్ కుమార్ ఆస్తులు కేవలం బిహార్‌కే పరిమితం కాలేదు. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, అంతేకాకుండా నేపాల్‌లో కూడా ఆయన పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం.ఇప్పటికే బీహార్‌ పోలీస్‌ శాఖ గౌతమ్ కుమార్‌ను సస్పెండ్ చేసింది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా మనీలాండరింగ్ కోణంలో విచారణ ప్రారంభించింది. ఇదిలా ఉండగా, ఈ కేసులో కీలక పాత్రధారి అయిన పనిమనిషి పారో ప్రస్తుతం కనిపించకుండా పోవడం మరో మిస్టరీగా మారింది. బెంగాల్‌లోని మాల్డా ప్రాంతానికి చెందిన ఆమె, కేసు వెలుగులోకి వచ్చిన వెంటనే అండర్‌గ్రౌండ్‌కి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story