Lpg Cylinder: గుడ్‌న్యూస్.. ఎల్‌పీజీ సరఫరాపై ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
Lpg Cylinder: వాణిజ్య ఎల్‌పీజీ సరఫరాపై ఉన్న అన్ని రకాల ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎత్తివేసింది.
Lpg Cylinder: గుడ్‌న్యూస్.. ఎల్‌పీజీ సరఫరాపై ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
LPG Supply: దేశంలోని హోటళ్లు, పరిశ్రమలు, భారీ వాణిజ్య సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. గత కొన్నాళ్లుగా వాణిజ్య, పారిశ్రామిక రంగానికి ఊపిరాడకుండా చేసిన ఎల్‌పీజీ ఆంక్షలన్నింటినీ తక్షణమే ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. గృహేతర ప్యాకేజ్డ్ ఎల్‌పీజీ సరఫరాపై గతంలో విధించిన రంగాల వారీ పరిమితులను పూర్తిగా తొలగించడంతో పారిశ్రామిక రంగం ఊపిరి పీల్చుకుంది.
అంతర్జాతీయంగా ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల కారణంగా తలెత్తిన సంక్షోభానికి ముందు ఎలాంటి పరిస్థితులు ఉండేవో.. ఇప్పుడు దేశంలో ఎల్‌పీజీ సరఫరా మళ్లీ అదే యధాస్థితికి చేరుకుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. సంక్షోభం ప్రారంభంలో నిలిచిపోయిన బల్క్ ఎల్‌పీజీ సరఫరాలు కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా పునఃప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఈ సరఫరాను సంక్షోభానికి ముందున్న వినియోగంలో 50 శాతానికి పునరుద్ధరించారు. దీనివల్ల ఇంధన లభ్యత పెరిగి, పారిశ్రామిక ఉత్పత్తి మళ్లీ ఊపందుకోనుంది.
అంతర్జాతీయ సంక్షోభ సమయంలో దేశీయంగా ఎల్‌పీజీ కొరత రాకుండా చూసేందుకు కేంద్రం అప్పట్లో యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టింది. అందులో భాగంగా.. నిత్యావసర వస్తువుల చట్టం కింద ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసి, రిఫైనరీల నుండి వచ్చే C3-C4 (ప్రొపేన్ – బ్యూటేన్) స్ట్రీమ్‌లను కేవలం ఎల్‌పీజీ ఉత్పత్తికి మాత్రమే ఉపయోగించాలనే నిబంధన పెట్టింది. పెట్రోకెమికల్ రంగం వైపు వెళ్లాల్సిన ఈ స్ట్రీమ్‌లను పూర్తిగా ఎల్‌పీజీ వైపు మళ్లించింది.
ప్రస్తుతం దేశీయంగా ఎల్‌పీజీ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. దీనికి తోడు విదేశాల నుండి దిగుమతి చేసుకున్న ఎల్‌పీజీ కార్గోలు కూడా సురక్షితంగా దేశానికి చేరుకున్నాయి. దేశంలో నిల్వలు పుష్కలంగా ఉండటంతో, ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్‌పీజీ పూల్‌లో C3-C4 స్ట్రీమ్‌ల వినియోగాన్ని తగ్గించనున్నారు.ఇకపై ఆ స్ట్రీమ్‌లను యధావిధిగా పెట్రోకెమికల్స్, ఇతర కీలక పారిశ్రామిక రంగాల అవసరాలకు కేటాయిస్తారు. దీనివల్ల పెట్రోకెమికల్ రంగం కూడా మళ్లీ పుంజుకోనుంది.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయం పూర్తిగా వాణిజ్య, పారిశ్రామిక రంగానికి మాత్రమే వర్తిస్తుంది. సామాన్య ప్రజలు ఇళ్లలో ఉపయోగించే గృహ గ్యాస్ సిలిండర్ల సరఫరాపై దీని ప్రభావం అస్సలు ఉండదు. గృహ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి కొరత ఉండబోదని, అలాగే వాటి ధరలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడబోదని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. మొత్తానికి, కేంద్రం నిర్ణయంతో అటు పారిశ్రామిక రంగానికి భారీ ఊరట లభించడమే కాకుండా, ఇటు సామాన్యుడి బడ్జెట్‌కు కూడా ఎలాంటి భంగం కలగకుండా బ్యాలెన్స్ మెయింటైన్ అయింది.




