Thief Dies: ఫస్ట్ టైమ్ దొంగతనం.. పాపం గుండెపోటుతో మృతి
Thief Dies: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒక ఊహించని విచిత్ర ఘటన చోటుచేసుకుంది.
Thief Dies: ఫస్ట్ టైమ్ దొంగతనం.. పాపం గుండెపోటుతో మృతి
Bengaluru Thief : క్రైమ్ సినిమాల్లో కూడా ఊహించని ఒక విచిత్రమైన ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. ఒక వ్యక్తి చేతిలోంచి మొబైల్ ఫోన్ లాక్కొని పారిపోవాలని చూసిన ఓ యువ దొంగ.. సీన్ కట్ చేస్తే కొద్ది దూరంలోనే గుండెపోటుతో రోడ్డుపైనే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పోలీసుల సమాచారం ప్రకారం.. ఈ నెల 15వ తేదీ సాయంత్రం బెంగళూరులోని బిజీ ఏరియా అయిన కబ్బన్‌పేట్‌లో జునైద్ (18), అర్బాజ్ (23) అనే ఇద్దరు యువకులు స్కూటర్‌పై వచ్చారు. రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి చేతిలోని మొబైల్‌ను క్షణాల్లో లాక్కొని వేగంగా పరారవడానికి ప్రయత్నించారు. అయితే బాధితుడు వెంటనే అప్రమత్తమై గట్టిగా అరుస్తూ దొంగలను వెంబడించాడు. ఇదే సమయంలో ఎదురుగా వస్తున్న ఓ సామాన్య కార్మికుడు సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. దొంగలు పారిపోతుండటం గమనించి.. తన చేతిలో ఉన్న ఒక బస్తాను వారి స్కూటర్‌పైకి బలంగా విసిరాడు. దీంతో స్కూటర్ అదుపుతప్పి ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు.
చుట్టుపక్కల జనాలు తమను పట్టుకోవడానికి వస్తున్నారని గమనించిన ఆ ఇద్దరు కేటుగాళ్లు.. స్కూటర్, దొంగిలించిన మొబైల్ ఫోన్‌ను అక్కడే వదిలేసి కాలినడకన పరుగులు తీశారు. అలా దాదాపు 250 మీటర్ల దూరం పరుగెత్తారో లేదో.. జునైద్ అనే 18 ఏళ్ల యువకుడు ఒక్కసారిగా గుండె పట్టుకుని రోడ్డుపైనే కుప్పకూలిపోయాడు. స్థానికులు, పోలీసులు వచ్చి పరిశీలించేసరికి అతడు అప్పటికే మృతి చెందాడు. మరో నిందితుడు అర్బాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో జునైద్ మరణానికి గల అసలు కారణం బయటపడింది. జునైద్‌కు చిన్న వయసులోనే గుండె సంబంధిత వ్యాధి ఉందని, గతంలో అతడికి హార్ట్ సర్జరీ జరిగి స్టంట్ కూడా అమర్చినట్లు తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. దొంగతనం దొరికిపోతుందనే భయంతో, ఒక్కసారిగా అంత దూరం వేగంగా పరుగెత్తడం వల్ల గుండెపై తీవ్ర శారీరక ఒత్తిడి పడి అతడు మరణించి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
మరో విచారకరమైన విషయం ఏంటంటే.. మృతి చెందిన జునైద్‌పై గతంలో ఎలాంటి క్రిమినల్ రికార్డ్ లేదు. అతడు దొంగతనం చేయడానికి ప్రయత్నించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. కాగా, పట్టుబడిన మరో నిందితుడు అర్బాజ్‌పై మాత్రం గతంలోనే పలు కేసులు ఉన్నాయి. తొలి నేరమే.. చివరి శ్వాసగా మారిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.




