Expired Food : బూజు పట్టిన కూరగాయలు, ఎక్స్‌పైరీ పాలు, టన్నుల కొద్దీ కుళ్ళిన మాంసం సీజ్.!
Expired Food : ఖరీదైన స్టార్ హోటళ్లకు వెళ్తే నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం లభిస్తుందని నమ్మే వినియోగదారులకు బెంగళూరులో జరిగిన ఒక సంఘటన తీవ్ర
Expired Food
Expired Food : ఖరీదైన స్టార్ హోటళ్లకు వెళ్తే నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం లభిస్తుందని నమ్మే వినియోగదారులకు బెంగళూరులో జరిగిన ఒక సంఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఐదు నక్షత్రాల (ఫైవ్ స్టార్), త్రీ స్టార్ హోటళ్లపై కర్ణాటక ఆహార భద్రత , ఔషధ పరిపాలన శాఖ నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. బూజు పట్టిన కూరగాయలు, గడువు తీరిన పాలు, నాసిరకం మాంసంతో పాటు తీవ్రమైన పరిశుభ్రతా లోపాలను అధికారులు స్వయంగా గుర్తించారు.
30 బృందాలు.. 26 ప్రముఖ హోటళ్లపై దాడి
బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) పరిధిలోని అన్ని జోన్లలో నిర్వహించిన ఈ విస్తృత తనిఖీల కోసం మొత్తం 30 ఆహార భద్రతా అధికారుల బృందాలు ఒకేసారి రంగంలోకి దిగాయి. నగరంలోని 26 ప్రముఖ త్రీ స్టార్, ఫైవ్ స్టార్ హోటళ్లపై దాడులు నిర్వహించి కిచెన్లు, ఆహార నిల్వ కేంద్రాలను పరిశీలించగా అక్కడి వాతావరణం అత్యంత అపరిశుభ్రంగా ఉన్నట్లు బయటపడింది. అంతేకాకుండా, శాకాహార , మాంసాహార పదార్థాలను వేర్వేరుగా ఉంచకపోవడం, FSSAI నిబంధనలకు విరుద్ధంగా సరైన లేబులింగ్ లేకుండా ఆహారాన్ని నిల్వ చేయడం వంటి తీవ్ర ఉల్లంఘనలు వెలుగు చూశాయి. ఒక ప్రముఖ హోటల్‌లో కుళ్ళిపోయిన బేకరీ పదార్థాలను కిచెన్ సిబ్బంది అధికారుల ముందే క్షమాపణలు చెబుతూ చెత్తబుట్టలో పడేసిన దృశ్యాలు విస్మయానికి గురిచేశాయి.
ఏ హోటల్‌లో ఎంత ఆహారం సీజ్ అయిందంటే?
ఈ దాడుల్లో బడా స్టార్ హోటళ్ల నుంచి భారీగా నాసిరకం, గడువు ముగిసిన ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. ది లలిత్ అశోక్ హోటల్ నుంచి 76 కిలోల మాంసం, 200 కిలోల కూరగాయలతో పాటు 32 లీటర్ల గడువు తీరిన పాలను సీజ్ చేశారు. ఈ రైడ్స్‌లోనే అత్యధికంగా ది రాడిసన్ బ్లూ హోటల్‌లో 105 కిలోల గడువు ముగిసిన ఆహార పదార్థాలు దొరికాయి, ఇందులో 50 కిలోల చికెన్, 23 కిలోల మటన్, 7 కిలోల చేపలు, 25 కిలోల కుళ్ళిన కూరగాయలు ఉన్నాయి. అలాగే తాజ్ యశ్వంతపూర్ నుంచి 72 కిలోల మాంసాన్ని, షాంగ్రి లా హోటల్ నుంచి 15 కిలోల నాసిరకం మాంసాన్ని, ఫోర్ సీజన్స్ హోటల్ నుంచి 19 కిలోల మాంసాన్ని , వివాంటా బెంగళూరు వైట్‌ఫీల్డ్ నుంచి 3 కిలోల ఎక్స్‌పైరీ బేకరీ ఉత్పత్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
లేబొరేటరీకి శాంపిల్స్ రవాణా.. చట్టపరమైన చర్యలు
ఈ తనిఖీల సందర్భంగా అధికారులు మొత్తం 35 రకాల ఆహార నమూనాలను సేకరించి విశ్లేషణ కోసం ఆహార పరిశోధనాశాలకు పంపించారు. టీ పొడి, చికెన్, మటన్, చేపలు, వంటనూనె, కారం, పసుపు, టమోటా సాస్, చీజ్, జీడిపప్పు , పాలు వంటి నిత్యావసర పదార్థాల నాణ్యతను పరీక్షించనున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన అన్ని హోటళ్లకు అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. లాబ్ నివేదికలు వచ్చిన తర్వాత చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల మహారాష్ట్ర ఎఫ్‌డీఏ (FDA) ముంబైలోని ప్రముఖ రెస్టారెంట్లు, క్లబ్‌లలో తనిఖీలు చేసి లైసెన్సులను రద్దు చేసిన తరహాలోనే, బెంగళూరులో కూడా తనిఖీలు ఉధృతం చేయడంతో మిగతా హోటల్ యాజమాన్యాల్లో కలకలం రేగుతోంది.




