రీల్స్ పిచ్చి.. వంట చేయడం లేదని భార్యను కడతేర్చిన భర్త!

Bengaluru: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్ పిచ్చి, ఇంటి పనులు చేయడం లేదనే కోపంతో బెంగళూరులో భార్య రీమాకుమారిని గొంతు నులిమి హత్య చేసిన భర్త ధీరజ్ కుమార్.

Arun Chilukuri
Published on: 8 Aug 2026 10:51 AM IST
రీల్స్ పిచ్చి.. వంట చేయడం లేదని భార్యను కడతేర్చిన భర్త!
X

రీల్స్ పిచ్చి.. వంట చేయడం లేదని భార్యను కడతేర్చిన భర్త!

Bengaluru: సోషల్ మీడియా మోజు ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఇన్‌స్టాగ్రామ్‌లో నిరంతరం రీల్స్‌ చూస్తూ సకాలంలో వంట, ఇంటి పనులు చేయడంలేదన్న ఆగ్రహంతో ఓ వ్యక్తి తన భార్యను కిరాతకంగా హత్య చేసిన ఘటన బెంగళూరులో ఆలస్యంగా వెలుగుచూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన ధీరజ్‌ కుమార్‌ (24), రీమాకుమారి (20) పది నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఉపాధి నిమిత్తం బెంగళూరుకు వచ్చిన వీరు అక్కడ నివాసముంటున్నారు. రీమాకుమారి ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, ధీరజ్‌ చిన్నచిన్న పనులు చేసేవాడు. అయితే, కొద్దిరోజులుగా రీమా ఇంటికి వచ్చిన తర్వాత నిరంతరం ఫోన్లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ కాలక్షేపం చేస్తోందని, ఇంటి పనులు, వంట సరిగా చేయడం లేదని ధీరజ్ ఆమెతో తరచూ గొడవపడేవాడు.

ఈ క్రమంలో గొడవ తీవ్రమవడంతో జులై 27న ధీరజ్ భార్య గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని పరుపులో చుట్టి ఇంట్లోనే ఉంచి అక్కడి నుంచి పరారయ్యాడు. వరుసగా రెండు రోజులు రీమా విధులకు రాకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె స్నేహితులు జులై 29న ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులు తెరిచి చూడగా, పరుపులో చుట్టి ఉన్న రీమా మృతదేహం లభ్యమైంది. పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక పోలీస్ బృందం బిహార్‌కు వెళ్లి ధీరజ్‌ను అదుపులోకి తీసుకుంది. బెంగళూరుకు తరలించి విచారించగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడని నైరుతి విభాగం డీసీపీ అనితా హద్దణ్ణనవర్‌ తెలిపారు. భార్య నిత్యం రీల్స్ చూస్తూ కాలం గడపడం, ఇంటి బాధ్యతలు పట్టించుకోకపోవడంతో విసిగిపోయి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story