Assembly Elections 2026 : ప్రజాస్వామ్య మహా సంగ్రామం.. మూడు రాష్ట్రాల్లో మొదలైన ఓట్ల జాతర
Assembly Elections 2026 : కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్. పినరయి విజయన్, హిమంత బిశ్వ శర్మ, గౌరవ్ గొగోయ్ వంటి ప్రముఖుల భవితవ్యాన్ని తేల్చనున్న ఓటర్లు.
Assembly Elections 2026
Assembly Elections 2026 : భారతదేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే మరో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేడు (గురువారం) ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ మూడు రాష్ట్రాల్లోని ఓటర్ల తీర్పు ఏ పార్టీకి పట్టం కడుతుందో, ఏ అగ్రనేత తలరాతను మారుస్తుందో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
కేరళలో పినరయి విజయన్ వర్సెస్ యూడీఎఫ్
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేడు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. దాదాపు 2.71 కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును ఇవ్వబోతున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన అభివృద్ధి మంత్రాన్ని నమ్ముకుని హ్యాట్రిక్ విజయంపై ధీమాగా ఉన్నారు. అయితే, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారాన్ని చేజిక్కించుకోవాలని రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలను రంగంలోకి దింపి భారీ ప్రచారం చేసింది. అటు బీజేపీ సైతం శబరిమల అంశం, స్థానిక సంస్థల విజయాలను బేస్ చేసుకుని తన ఉనికిని చాటుకోవాలని చూస్తోంది. 883 మంది అభ్యర్థుల భవితవ్యం ఈరోజు తేలిపోనుంది.
అస్సాంలో హ్యాట్రిక్ కోసం బీజేపీ ఫైట్
అస్సాంలోని 126 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆరోసారి జలుక్బారి నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరోవైపు, కాంగ్రెస్ అగ్రనేత గౌరవ్ గొగోయ్ తొలిసారి అసెంబ్లీ బరిలో నిలిచి బీజేపీకి గట్టి పోటీ ఇస్తున్నారు. మొత్తం 2.50 కోట్ల మంది ఓటర్లు ఉన్న ఈ రాష్ట్రంలో మహిళా ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఏఐయూడీఎఫ్ అధినేత బద్రుద్దీన్ అజ్మల్ వంటి నేతలు కూడా తమ పట్టును నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు.
పుదుచ్చేరిలో మారిన సమీకరణాలు - విజయ్ ఎంట్రీ
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ సీట్ల కోసం పోలింగ్ జరుగుతోంది. ఇక్కడ ప్రధాన పోటీ ఏఐఎన్ఆర్సీ-బీజేపీ కూటమి, కాంగ్రెస్-డీఎంకే కూటమి మధ్య ఉన్నప్పటికీ, నటుడు విజయ్ స్థాపించిన టీవీకే (TVK) పార్టీ ఎంట్రీతో సమీకరణాలు మారిపోయాయి. విజయ్ పార్టీ అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టడంతో యువత ఓట్లు ఎటు వెళ్తాయో అన్న ఆందోళన ప్రధాన పార్టీల్లో కనిపిస్తోంది. ప్రస్తుత సీఎం రంగసామి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తుండటం విశేషం.
పటిష్టమైన భద్రత, సాంకేతికత
ఎన్నికల అక్రమాలను అరికట్టేందుకు ఎన్నికల సంఘం తొలిసారిగా డ్రోన్లను పెద్ద ఎత్తున వినియోగిస్తోంది. ముఖ్యంగా పుదుచ్చేరిలో మద్యం, డబ్బు పంపిణీపై డ్రోన్లతో నిఘా పెట్టారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ సదుపాయం కల్పించడమే కాకుండా, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. వృద్ధులు, దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వలంటీర్లను నియమించి, వీల్ చైర్లను అందుబాటులో ఉంచారు. సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.


