Assembly Election Results 2026 : చరిత్రను తిరగరాస్తారా? లేక పాత పద్ధతికే జై కొడతారా? నేడే ఐదు ఎన్నికల ఫలితాలు
Assembly Election Results 2026 : గత రెండు నెలలుగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళం, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల పోరాటం ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది.
Assembly Election Results 2026
Assembly Election Results 2026 : భారతదేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే కీలకమైన రోజు వచ్చేసింది. గత రెండు నెలలుగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళం, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల పోరాటం ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. నేడు (సోమవారం) ఉదయం 8 గంటల liనుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ ఐదు రాష్ట్రాల ప్రజలు ఎవరికి పట్టం కట్టారు? ఎవరిని ఇంటికి పంపారు? అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. దేశమంతా ఇప్పుడు ఈ సూపర్ మండే ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.
పశ్చిమ బెంగాల్: దీదీ వర్సెస్ మోదీ
అందరి కళ్లు పశ్చిమ బెంగాల్‌పైనే ఉన్నాయి. 294 స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో మమతా బెనర్జీ తన లక్ష్మీ భండార్ పథకాలు, ప్రాంతీయ సెంటిమెంట్‌తో గెలుపుపై ధీమాగా ఉన్నారు. మరోవైపు బీజేపీ అవినీతి వ్యతిరేక నినాదంతో మార్పు వస్తుందని నమ్ముతోంది. భవానీపూర్ సీటులో మమతా బెనర్జీ, సువేందు అధికారి మధ్య హోరాహోరీ పోరు సాగింది. అయితే, ఫల్తా నియోజకవర్గంలో గందరగోళం కారణంగా అక్కడ రీ-పోలింగ్ జరగనుంది, కాబట్టి బెంగాల్ పూర్తి ఫలితం మే 24న వెలువడనుంది. నేడు మాత్రం 293 సీట్ల ఫలితాలు వెల్లడవుతాయి.
తమిళనాడు: విజయ్ పార్టీ (TVK) గేమ్ ఛేంజర్ అవుతుందా?
తమిళనాడులో ఈసారి ఎన్నికలు చాలా భిన్నంగా జరిగాయి. డీఎంకే (DMK), ఏఐఏడీఎంకే (AIADMK) మధ్య ఎప్పటిలాగే పోరు ఉన్నప్పటికీ, స్టార్ హీరో విజయ్ స్థాపించిన TVK పార్టీ ఎంట్రీతో సమీకరణాలు మారాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం విజయ్ పార్టీ యువత ఓట్లను భారీగా కొల్లగొట్టే అవకాశం ఉంది. పైగా ఈసారి 85 శాతానికి పైగా పోలింగ్ నమోదు కావడంతో, పెరిగిన ఓటింగ్ శాతం ఎవరిని గద్దెనెక్కిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
కేరళం: చరిత్ర పునరావృతం అవుతుందా?
కేరళలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారే సంప్రదాయం ఉంది. కానీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆ సంప్రదాయాన్ని చెరిపివేసి మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు. అటు యూడీఎఫ్ (UDF) అధికారంలోకి వస్తామని ఆశిస్తుంటే, బీజేపీ ఈసారి కేరళలో బలమైన పోటీ ఇచ్చింది. రాజీవ్ చంద్రశేఖర్ వంటి కేంద్ర మంత్రులు బరిలో ఉండటంతో కేరళ ఫలితం కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అస్సాం, పుదుచ్చేరి
అస్సాంలో ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ నేతృత్వంలో బీజేపీ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. చొరబాటు దారులు, ప్రాంతీయ అభివృద్ధి చుట్టూ ఇక్కడ రాజకీయం సాగింది. ఇక పుదుచ్చేరిలో 30 స్థానాలకు గాను ఈసారి స్వతంత్ర అభ్యర్థులు కింగ్ మేకర్లుగా మారే అవకాశం కనిపిస్తోంది. సుమారు 20 స్థానాల్లో స్వతంత్రులు గట్టి పోటీ ఇవ్వడంతో పుదుచ్చేరిలో హంగ్ వచ్చే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.




