Assam Floods : అస్సాంలో 82కు చేరిన మరణాలు.. 1.9 లక్షల మందికిపైగా ఎఫెక్ట్.!
Assam Floods : అస్సాం రాష్ట్రాన్ని వరదలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. శనివారం నాటికి రాష్ట్రంలోని ఐదు జిల్లాలు తీవ్ర వరద ప్రభావంలోనే ఉన్నాయని, దాదాపు..
Assam-Floods
Assam Floods : అస్సాం రాష్ట్రాన్ని వరదలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. శనివారం నాటికి రాష్ట్రంలోని ఐదు జిల్లాలు తీవ్ర వరద ప్రభావంలోనే ఉన్నాయని, దాదాపు 1,92,799 మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు వెల్లడించారు. తాజాగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఈ ఏడాదంతటిలో వరదల వల్ల చనిపోయిన వారి సంఖ్య 82కు చేరుకుంది.
ఐదు జిల్లాల్లో ముంచెత్తిన వరద నీరు
గురువారంతో పోలిస్తే పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ కొన్ని జిల్లాల్లో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. ప్రస్తుతం శివసాగర్, గోలాఘాట్, జోర్హాట్, నగావ్ , చరైడియో జిల్లాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. బాధిత జిల్లాల్లో చరైడియో అత్యంత తీవ్రంగా దెబ్బతినగా ఒక్క ఇక్కడే 77,456 మంది వరద బారిన పడ్డారు. ఆ తర్వాత శివసాగర్‌లో 63,492 మంది, జోర్హాట్‌లో 34,067 మంది తీవ్రంగా ప్రభావితమయ్యారు. తాజాగా శివసాగర్, చరైడియో జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర సంతాపాన్ని నింపింది. నివాస ప్రాంతాలను నీళ్లు ముంచెత్తడంతో దాదాపు 13,000 మంది ప్రజలు 54 పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు.
పొంగిపొర్లుతున్న నదులు.. రంగంలోకి రెస్క్యూ బృందాలు
శివసాగర్ వద్ద ప్రవహించే దిఖోవ్ నది, గోలాఘాట్‌లోని నుమాలిగఢ్ వద్ద ఉన్న ధన్‌సిరి నదులు ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఆ నదీ పరివాహక ప్రాంత ప్రజలు నదుల వద్దకు వెళ్లకుండా దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) బృందాలు నిరంతరం రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొంటూ సాయం అందిస్తున్నాయి.
బాధితులకు ఊరట.. అప్పుల వాయిదాలపై మోరటోరియం
వరద బాధితులను ఆదుకోవడానికి అస్సాం ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తీవ్రంగా దెబ్బతిన్న శివసాగర్, చరైడియో, జోర్హాట్, గోలాఘాట్ జిల్లాల్లోని ప్రజలకు బ్యాంకులు , నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి తీసుకున్న రుణాల చెల్లింపుపై 6 నెలల పాటు మోరటోరియం ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై ఇన్సూరెన్స్ కంపెనీలు, ఫైనాన్స్ సంస్థలతో ప్రభుత్వం త్వరలోనే భేటీ కానుంది.
వరదల్లో దెబ్బతిన్న వాహనాలు, పశువులు , ఆస్తులకు సంబంధించిన ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను వీలైనంత త్వరగా ప్రాసెస్ చేయాలని ఇన్సూరెన్స్ కంపెనీలను కోరనున్నారు. దీనితో పాటు పీఎం సూర్య ఘర్ పథకం కింద రావలసిన రూ. 41.67 కోట్ల రాష్ట్ర సబ్సిడీని వరద ప్రభావిత ప్రాంతాలలోని 9,289 మంది లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేయాలని విద్యుత్ శాఖను సీఎం హిమంత బిశ్వ శర్మ ఆదేశించారు. బాధితులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తక్షణమే నష్ట పరిహారం అంచనా వేసి నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది.




