Assam Floods : వరదలోనూ మానవత్వం.. వీడియో వైరల్..!
Assam Floods : ప్రకృతి కోపానికి ఇళ్లు, వాకిళ్లు, ఊరూ వాడా కొట్టుకుపోయి తీవ్ర ఆవేదనలో ఉన్నా.. ఆపద సమయంలో తమను ఆదుకోవడానికి వచ్చిన వారిపై ఆ మహిళ..
Viral-Video
Assam Floods : ప్రకృతి కోపానికి ఇళ్లు, వాకిళ్లు, ఊరూ వాడా కొట్టుకుపోయి తీవ్ర ఆవేదనలో ఉన్నా.. ఆపద సమయంలో తమను ఆదుకోవడానికి వచ్చిన వారిపై ఆ మహిళ చూపించిన ప్రేమానురాగాలు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. అస్సాంలో దారుణంగా సంభవించిన వరదల వేళ ఓ సాధారణ మహిళ చేసిన చిన్న సహాయం కోట్లాది మంది హృదయాలను తాకింది.
నడుముల్లోతు నీటిలో నడుచుకుంటూ వచ్చి..
అస్సాంలోని ఓ గ్రామంలో వరద బాధితులను కాపాడేందుకు, వారికి సహాయక సామాగ్రి అందించేందుకు స్వచ్ఛంద కార్యకర్తలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. బురద, వరద నీటిలో నిరంతరం కష్టపడుతూ అలసిపోయి ఉన్న ఆ వాలంటీర్లను చూసి గ్రామానికి చెందిన ఒక బాధితురాలు చలించిపోయింది. తన ఇంట్లో అందుబాటులో ఉన్న పదార్థాలతో స్వయంగా జ్యూస్‌ను తయారు చేసి, ఒక ట్రేలో పెట్టుకుని నడుముల్లోతు నీటిలో నడుచుకుంటూ వాలంటీర్ల వద్దకు వచ్చింది. ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ప్రతి ఒక్కరికీ జ్యూస్ గ్లాసులను అందించింది. ఆ మహిళ చూపించిన అనురాగానికి, సేవ నిరతికి వాలంటీర్లు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తమ అలసటనంతా మరచిపోయి చిరునవ్వుతో ఆ జ్యూస్‌ను స్వీకరించి, ఆమెకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసి మళ్లీ తమ సహాయక చర్యల్లో మునిగిపోయారు.
సర్వస్వం కోల్పోయినా సడలని మానవత్వం
ఈ దృశ్యం వెనుక ఉన్న అసలు కథ తెలిశాక నెటిజన్లు మరింతగా కంటతడి పెడుతున్నారు. సదరు మహిళ కూడా ఒక వరద బాధితురాలే. ఈ ప్రకృతి వైపరీత్యంలో ఆమె తన ఇల్లు, నిత్యావసరాలు, సర్వస్వం కోల్పోయింది. సరిగ్గా తినడానికి తిండి, ఉండటానికి నీడ లేని పరిస్థితిలోనూ ఆమె తన బాధను పక్కనబెట్టింది. ప్రాణాలకు తెగించి తమ గ్రామానికి వచ్చి తాగునీరు, ఆహారం, వైద్య సదుపాయాలు అందిస్తున్న ఆపద్బాంధవులకు ఏదో ఒకటి చేయాలని భావించింది. "చీకటి రోజుల్లోనే మానవత్వం మరింత ప్రకాశిస్తుంది" అని నిరూపించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కష్టాల్లో ఉన్నప్పటికీ తోటివారికి సహాయం చేయాలనే ఆమె ఉదారతను, కొండంత ధైర్యాన్ని వేలాది మంది నెటిజన్లు కొనియాడుతున్నారు.
అస్సాంలో ఇంకా వీడని వరద ముప్పు
మరోవైపు అస్సాంలో వరద ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. శనివారం నాటికి రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో (శివసాగర్, గోలాఘాట్, జోర్హాట్, నగావ్, చరాయ్‌దేవ్) సుమారు 1,92,799 మంది ప్రజలు వరద నీటిలోనే చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఈ ఏడాది వరదల వల్ల మరణించిన వారి సంఖ్య ఏకంగా 82కు చేరిందని అధికారులు వెల్లడించారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు, రెస్క్యూ బృందాలు అక్కడ విస్తృతంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.




