New Delhi: ఆక్వా, పొగాకు రైతులను ఆదుకోండి!

New Delhi: న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసిన సీఎం చంద్రబాబు. ఆక్వా, పొగాకు రైతుల సమస్యలపై చర్చ. ఫిష్‌మీల్ ఎగుమతులపై నియంత్రణకు విజ్ఞప్తి.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 23 July 2026 10:48 AM IST
New Delhi
X

New Delhi: ఆక్వా, పొగాకు రైతులను ఆదుకోండి!

New Delhi: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు న్యూఢిల్లీలో కేంద్ర వాణిజ్య & పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రంలోని పొగాకు రైతులు, ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ...

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ఆక్వా మరియు పొగాకు రంగాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకోవాలని, రైతుల ప్రయోజనాలను పరిరక్షించేలా తగిన విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు.

సమావేశంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు డా. బీద మస్తాన్ రావు యాదవ్ ఆక్వా రైతులు, ఆక్వా ఫీడ్ తయారీ పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితులను కేంద్ర మంత్రి దృష్టికి సవివరంగా తీసుకెళ్లారు. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, అంతర్జాతీయ ధరల హెచ్చుతగ్గులు, రొయ్యల ఎగుమతులపై ప్రభావం, రైతులకు గిట్టుబాటు ధరలు లభించకపోవడం, ముడి పదార్థాల ధరలు భారీగా పెరగడం, ముఖ్యంగా ఫిష్‌మీల్, ఫిష్ ఆయిల్, సోయాబీన్ మీల్, విటమిన్లు, ఖనిజాల ధరలు గణనీయంగా పెరగడం వల్ల ఆక్వా ఫీడ్ తయారీ వ్యయం భారీగా పెరిగిందని వివరించారు. అదేవిధంగా దేశంలో ఉత్పత్తి అవుతున్న ఫిష్‌మీల్‌లో అత్యధిక భాగం విదేశాలకు ఎగుమతి కావడం వల్ల దేశీయంగా తీవ్రమైన కొరత ఏర్పడుతోందని, దీని కారణంగా ఫీడ్ తయారీ వ్యయం పెరిగి రైతులపై అదనపు భారం పడుతోందని తెలిపారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఫిష్‌మీల్, ఫిష్ ఆయిల్ ఎగుమతులపై తాత్కాలిక నియంత్రణ విధించడం, అవసరమైతే పరిమితులు విధించడం లేదా దేశీయ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

అంతేకాకుండా జీఎం సోయాబీన్ మీల్ దిగుమతులకు అనుమతులు కల్పించడం, ఆక్వా ఫీడ్ ముడి పదార్థాల లభ్యతను మెరుగుపరచడం, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించే చర్యలు చేపట్టడం, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడం, ప్రధాన దిగుమతి దేశాల్లో భారత రొయ్యలకు కొత్త మార్కెట్లు కల్పించడం, అంతర్జాతీయ వాణిజ్య సంబంధిత సమస్యలను కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని పరిష్కరించాలని కేంద్ర మంత్రిని కోరారు.

రైతులు ప్రస్తుతం అధిక ఉత్పత్తి వ్యయాలు, తక్కువ మార్కెట్ ధరలు, వ్యాధుల ప్రభావం, ఎగుమతుల మందగమనం వంటి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, వీటిని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం విధానపరమైన సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని బీద మస్తాన్ రావు యాదవ్ వివరించారు.

కేంద్ర వాణిజ్య & పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్ చేసిన విజ్ఞప్తులను సానుకూలంగా పరిశీలించి, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని ఆక్వా మరియు పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ ప్రతినిధి బృందంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర భారీ పరిశ్రమలు & ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story