Anna Hazare: ఆప్‌పై అన్నా హజారే ఫైర్.. ‘ఇది నాయకత్వ వైఫల్యమే’!

Anna Hazare: ఆమ్ ఆద్మీ పార్టీలో భారీ చీలికపై సామాజిక కార్యకర్త అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 25 April 2026 2:27 PM IST
Anna Hazare
X

Anna Hazare: ఆప్‌పై అన్నా హజారే ఫైర్.. ‘ఇది నాయకత్వ వైఫల్యమే’!

Anna Hazare: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) వ్యవస్థాపక సిద్ధాంతాలకు తూట్లు పొడిచిందని, అందుకే ఆ పార్టీ నేడు ఈ దుస్థితిని ఎదుర్కొంటోందని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే విమర్శించారు. రాఘవ్ చద్దాతో పాటు ఏడుగురు రాజ్యసభ ఎంపీలు ఒకేసారి కమలం గూటికి చేరడంపై ఆయన మహారాష్ట్రలోని అహిల్యనగర్‌లో ఘాటుగా స్పందించారు.

"పార్టీ సరైన మార్గంలో ఉండి ఉంటే ఇంతమంది ఎంపీలు ఒకేసారి బయటకు వెళ్లేవారు కాదు. దీనికి అధిష్ఠానానిదే పూర్తి బాధ్యత. వ్యవస్థాపక సిద్ధాంతాల నుంచి ఆప్ పక్కకు తప్పుకుందనడానికి ఈ పరిణామాలే నిదర్శనం" అని అన్నా హజారే కుండబద్దలు కొట్టారు. ఆప్ అంతర్గత విభేదాలు మరియు నాయకత్వ లోపాలు ఇప్పుడు బహిర్గతమయ్యాయని ఆయన విశ్లేషించారు.

శుక్రవారం (ఏప్రిల్ 24) దేశ రాజధానిలో పెను సంచలనం చోటుచేసుకుంది. ఆప్ అగ్రనేత రాఘవ్ చద్దాతో పాటు సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, హర్భజన్ సింగ్, స్వాతి మలీవాల్, రాజిందర్ గుప్తా, విక్రమ్ సాహ్ని లు ఒకేసారి ఆప్‌కు రాజీనామా చేసి బీజేపీ కండువా కప్పుకున్నారు. పార్టీలో విలువలు, నైతికత పూర్తిగా కనుమరుగయ్యాయని ఈ సందర్భంగా రాఘవ్ చద్దా ఆవేదన వ్యక్తం చేశారు.

రాజ్యసభలో రాఘవ్ చద్దాను ఉపనేత పదవి నుంచి తప్పించి, అశోక్ మిట్టల్‌కు ఆ బాధ్యతలు అప్పగించడమే ఈ భారీ చీలికకు ప్రధాన కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2012లో అవినీతికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిన ఆప్, ఇప్పుడు ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడింది. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వానికి ఇది అతిపెద్ద సవాలుగా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story