Amit Shah: పవన్ కల్యాణ్‌కు షాకిచ్చిన అమిత్ షా

Amit Shah: తెలంగాణ రాజకీయాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Naresh.k
Published on: 10 Jun 2026 9:13 AM IST
Amit Shah
X

Amit Shah: పవన్ కల్యాణ్‌కు షాకిచ్చిన అమిత్ షా

Janasena: తెలంగాణ రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్‌గానే సాగుతుంటాయి. కానీ, తాజాగా ఢిల్లీ నుంచి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేశాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పొత్తుల వ్యవహారంపై ఆయన అడిగిన ప్రశ్నలకు ఏమాత్రం తడుముకోకుండా కుండబద్దలు కొట్టి చెప్పారు. రాష్ట్రంలో ఏ పార్టీతోనూ పొత్తు ఉండబోదని, రాబోయే రోజుల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని అమిత్ షా స్పష్టం చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడిన అమిత్ షా.. బీజేపీ భవిష్యత్తు వ్యూహాలపై క్లియర్ కట్ అప్‌డేట్ ఇచ్చారు. ఇకపైన ఏ రాష్ట్రంలోనైనా సరే ఒంటరిగా పోటీ చేసి, సొంతంగా అధికారంలోకి రావాలన్నదే తమ అంతిమ లక్ష్యమని ప్రకటించారు. తెలంగాణ, పంజాబ్ ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఎలాంటి పొత్తులు లేకుండా ఒంటరిగానే ముందుకు వెళ్లాలనే పక్కా ప్లాన్‌తో ఉన్నామని స్పష్టం చేశారు. ఈసారి దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి సారించిందని, అక్కడ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తామని చెప్పారు.

రాజకీయాల్లో అసాధ్యం అనుకున్న ఎన్నో విజయాలను బీజేపీ సొంతం చేసుకుంది. పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలోనే మేము ఊహించని ఫలితాలు రాబట్టాం. కాబట్టి దక్షిణాదిలో ఒంటరి పోరాటం ద్వారా అధికారం సాధించడం అసాధ్యమేమీ కాదని అమిత్ షా చెప్పుకొచ్చారు. పొత్తుల విషయమే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న యూనిఫామ్ సివిల్ కోడ్‌పైనా అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో మున్ముందు పక్కాగా యూనిఫామ్ సివిల్ కోడ్‌ను అమలు చేసి తీరుతామని ఆయన పునరుద్ఘాటించారు.

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా ఏర్పడి సంచలన విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణలో కూడా అదే తరహాలో ఈ మూడు పార్టీలు కలిసి మహా కూటమిగా బరిలోకి దిగుతాయని క్షేత్రస్థాయిలో జోరుగా ప్రచారం సాగింది. ముఖ్యంగా జనసేన, టీడీపీ శ్రేణులు తెలంగాణలోనూ కలిసి నడిచేందుకు ఆసక్తి చూపించాయి. ముఖ్యంగా తెలంగాణలో పోటీ చేయలనుకున్నా పవన్ కల్యాణ్‌కు ఇది మింగుడు పడని విషయమే అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

అమిత్ షా ప్రకటనతో తెలంగాణలో బీజేపీ-జనసేన-టీడీపీ కూటమి ఏర్పాటు కావడం దాదాపు అసాధ్యమనే సంకేతాలు వచ్చేసాయి. ఏపీ సమీకరణాలు వేరు, తెలంగాణ వ్యూహాలు వేరు అని అధిష్టానం బలంగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. మరి అమిత్ షా ఊహించినట్టుగా ఒంటరి పోరుతో తెలంగాణలో బీజేపీ ఏ మేరకు పట్టు సాధిస్తుందో చూడాలి.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story