Amarnath Yatra 2026: అమర్నాథ్ భక్తులకు పీఎం మోదీ శుభాకాంక్షలు.. యాత్రికులకు 'ఐదు సంకల్పాల' పిలుపు!
Amarnath Yatra 2026: జమ్మూ-కశ్మీర్లో నేటి (శుక్రవారం) నుంచి పవిత్ర అమర్నాథ్ యాత్ర ఘనంగా ప్రారంభమైంది.
Amarnath Yatra 2026: అమర్నాథ్ భక్తులకు పీఎం మోదీ శుభాకాంక్షలు.. యాత్రికులకు 'ఐదు సంకల్పాల' పిలుపు!
Amarnath Yatra 2026: సనాతన హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వార్షిక అమర్నాథ్ యాత్ర శుక్రవారం (జులై 3) జమ్మూ-కశ్మీర్లో అధికారికంగా ప్రారంభమైంది. ఈ ఆధ్యాత్మిక మహోత్సవాన్ని పురస్కరించుకుని దేశవిదేశాల నుంచి తరలివస్తున్న శివభక్తులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పవిత్ర ప్రయాణాన్ని ఒక 'గొప్ప భాగ్యం'గా అభివర్ణించిన ప్రధాని, భక్తులు భక్తిశ్రద్ధలతో, క్రమశిక్షణతో, బాధ్యతాయుతమైన జాతీయ భావనతో ముందుకు సాగాలని కోరారు. ఈ మేరకు శివభక్తులను ఉద్దేశించి రాసిన ఒక ప్రత్యేక లేఖను ఆయన ఎక్స్ (X) వేదికగా పంచుకున్నారు.
అమర్నాథ్ యాత్ర భారతదేశ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఒక శాశ్వతమైన అధ్యాయమని ప్రధాని మోదీ కొనియాడారు. ప్రతి ఏటా 'బాబా బర్ఫానీ' (మంచు లింగం)ని నేరుగా దర్శించుకునే ఈ అవకాశం లక్షలాది మంది భక్తులకు మరపురాని అనుభూతిని ఇస్తుందన్నారు.
ప్రపంచవ్యాప్తంగా సనాతన సంస్కృతిని అనుసరించే భక్తులంతా విభిన్న ప్రాంతాలు, భిన్న భాషలు, రకరకాల ఆచారాలు కలిగి ఉన్నప్పటికీ.. మహాదేవుని ఆశీస్సులు పొందాలనే ఒకే ఒక సంకల్పంతో ఇక్కడికి తరలివస్తారని మోదీ గుర్తుచేశారు. ఈ రెండు నెలల కాలంలో బాబా పవిత్ర సన్నిధిలో భారతదేశ 'భిన్నత్వంలో ఏకత్వం' అనే అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతుందని ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు. ఈ యాత్ర సజావుగా సాగడానికి అహర్నిశలు శ్రమిస్తున్న భారత సైన్యం, సీఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీస్, ఐటీబీపీ, బీఎస్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఆరోగ్య కార్యకర్తలు, పరిపాలనా అధికారులు, వాలంటీర్లకు పీఎం మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
అమర్నాథ్ యాత్రికులకు పీఎం మోదీ సూచించిన 'ఐదు సంకల్పాలు':
పరిశుభ్రత పాటించడం: అమర్నాథ్ యాత్ర మార్గంలో ఎక్కడా ప్లాస్టిక్ లేదా ఇతర చెత్తాచెదారం వేయకుండా, పవిత్రమైన కొండలను పరిశుభ్రంగా ఉంచుతూ నిరంతరం స్వచ్ఛత నియమాలను తూచా తప్పకుండా పాటించాలి.
పరిపాలన నిబంధనల గౌరవం: మారుతున్న వాతావరణ పరిస్థితులు, భారీ వర్షాల నేపథ్యంలో జారే మార్గాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. స్థానిక పరిపాలనా యంత్రాంగం ఇచ్చే ఆదేశాలను, భద్రతా సూచనలను, ట్రాఫిక్ నిబంధనలను పూర్తిగా అంకితభావంతో గౌరవించాలి.
వోకల్ ఫర్ లోకల్ (Vocal for Local): జమ్మూ కశ్మీర్ స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు, యాత్రికులు తమ మొత్తం ప్రయాణ ఖర్చులలో కనీసం 10 శాతం మొత్తాన్ని అక్కడి స్థానిక ఉత్పత్తులు, హస్తకళల కొనుగోలుకు కేటాయించాలి. ఇది అక్కడి పేద కుటుంబాలకు, యువతకు ఉపాధినిస్తుంది.
ఏక్ పేడ్ మా కే నామ్ (మొక్కలు నాటడం): రక్షాబంధన్ పండుగతో ముగిసే ఈ యాత్ర ముగింపు సందర్భంగా.. 'ఏక్ పేడ్ మా కే నామ్' (అమ్మ పేరిట ఒక మొక్క) దేశవ్యాప్త ప్రచారంలో భాగంగా ప్రతి భక్తుడు తప్పనిసరిగా ఒక మొక్కను నాటి పర్యావరణాన్ని రక్షించాలి.
వికసిత్ భారత్ నిర్మాణం: దేశమే ప్రథమమనే ('Nation First') భావనను గుండెల్లో ఉంచుకుని, పౌరులుగా మన బాధ్యతలను ఏడాది పొడవునా నిజాయితీగా నిర్వర్తిస్తూ, భారతదేశాన్ని 'వికసిత్ భారత్'గా మార్చే నిర్మాణంలో ప్రతి ఒక్కరూ చురుకైన పాత్ర పోషించాలి.
చివరగా, బాబా అమర్నాథ్ ఆశీస్సులతో భక్తులందరి ప్రయాణం సుఖమయంగా, అత్యంత సురక్షితంగా మరియు ఆధ్యాత్మిక అనుభూతితో సాగాలని ఆకాంక్షిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సందేశాన్ని ముగించారు.




