Akhilesh Yadav: యూపీ రాజకీయాల్లో అరుదైన దృశ్యం.. తన దిష్టిబొమ్మ దహనం చేస్తూ గాయపడిన ఎమ్మెల్యే వద్దకు అఖిలేశ్!

Akhilesh Yadav: తన దిష్టిబొమ్మను దహనం చేస్తూ తీవ్రంగా గాయపడిన బీజేపీ ఎమ్మెల్యే అనుపమ జైస్వాల్‌ను సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ పరామర్శించారు.

Arun Chilukuri
Published on: 29 April 2026 10:36 AM IST
Akhilesh Yadav
X

Akhilesh Yadav: యూపీ రాజకీయాల్లో అరుదైన దృశ్యం.. తన దిష్టిబొమ్మ దహనం చేస్తూ గాయపడిన ఎమ్మెల్యే వద్దకు అఖిలేశ్!

Akhilesh Yadav: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో అరుదైన, హృదయపూర్వక దృశ్యం ఆవిష్కృతమైంది. రాజకీయంగా బద్ధశత్రువులుగా భావించే పార్టీల మధ్య మానవత్వం చిగురించింది. తన దిష్టిబొమ్మను దహనం చేస్తూ ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడిన బీజేపీ ఎమ్మెల్యే అనుపమ జైస్వాల్‌ను సమాజ్‌వాదీ పార్టీ (SP) అధినేత అఖిలేశ్ యాదవ్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'నారీ శక్తి వందన్ అధినియమ్'కు మద్దతుగా బహ్రాయిచ్‌లో బీజేపీ శ్రేణులు ప్రదర్శన చేపట్టాయి. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత అఖిలేశ్ యాదవ్ దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా, ఒక్కసారిగా మంటలు ఎగసిపడి ఎమ్మెల్యే అనుపమ జైస్వాల్‌ను చుట్టుముట్టాయి. ఈ ప్రమాదంలో ఆమె ముఖం, నుదురు, చెవి భాగాలు తీవ్రంగా కాలిపోయాయి. వెంటనే ఆమెను లఖ్‌నవూలోని మేదాంత ఆసుపత్రికి తరలించారు.

విషయం తెలిసిన వెంటనే అఖిలేశ్ యాదవ్ ఆసుపత్రికి చేరుకుని అనుపమ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. "సమాజంలో మాకు విద్వేషాల మంటలు వద్దు, సామరస్యం కావాలి. రాజకీయాల కంటే మానవ సంబంధాలే ముఖ్యం" అని పేర్కొన్నారు. అఖిలేశ్ చూపిన ఈ చొరవపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అనుపమ భర్త అశోక్ జైస్వాల్ స్పందిస్తూ.. ఇది ప్రజాస్వామ్య మర్యాదకు నిదర్శనమని అఖిలేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రస్తుతం అనుపమ జైస్వాల్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆమె ముఖంపై 75 శాతం, నుదురు మరియు చెవి భాగంలో 60 శాతం కాలిన గాయాలయ్యాయని, కంటికి కూడా పాక్షికంగా గాయమైందని వైద్యులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫోన్ ద్వారా పరిస్థితిని సమీక్షించగా, డిప్యూటీ సీఎంలు బ్రజేశ్ పాఠక్, కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా ఆమెను పరామర్శించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story