Air India : ఎయిర్ ఇండియా తప్పిదం.. గాల్లోనే 8 గంటలు చక్కర్లు కొట్టిన విమానం..ప్రాణభయంతో ప్రయాణికులు
Air India : ఎయిర్ ఇండియా నిర్వాకం వల్ల వ్యాంకోవర్ వెళ్లాల్సిన విమానం 8 గంటలు గాల్లో ప్రయాణించి మళ్ళీ ఢిల్లీకి చేరింది. కెనడా ప్రవేశానికి అనుమతి లేని విమానాన్ని పంపడమే దీనికి కారణం.
Air India
Air India : ఎయిర్ ఇండియా విమానయాన సంస్థలో విచిత్రమైన ఘటనలు జరగడం కొత్తేమీ కాదు కానీ, తాజాగా జరిగిన ఒక పొరపాటు మాత్రం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. కెనడా వెళ్లాల్సిన ఒక విమానం, ఏకంగా ఎనిమిది గంటల పాటు గాల్లో ప్రయాణించి.. చివరికి ఎక్కడి నుంచి బయలుదేరిందో మళ్ళీ అక్కడికే (ఢిల్లీకి) చేరుకుంది. సాంకేతిక లోపం కాదు, వాతావరణం బాగోలేక కాదు.. కేవలం ఎయిర్ ఇండియా యాజమాన్యం చేసిన ఒక చిన్న తప్పిదం వల్ల ప్రయాణికులు నరకం చూశారు.
అసలేం జరిగింది?
మార్చి 20వ తేదీన ఉదయం 11:34 గంటలకు ఎయిర్ ఇండియా విమానం AI185 ఢిల్లీ నుంచి కెనడాలోని వ్యాంకోవర్‌కు బయలుదేరింది. ప్రయాణికులంతా హ్యాపీగా తమ గమ్యం చేరుకుంటామని భావించారు. విమానం దాదాపు నాలుగు గంటల పాటు ప్రయాణించి చైనా గగనతలం (కున్మింగ్ ప్రాంతం) చేరుకుంది. అప్పుడే అసలు ట్విస్ట్ తెలిసింది. ఆ విమానానికి కెనడాలో ప్రవేశించడానికి అవసరమైన అధికారిక అనుమతులు లేవని గ్రౌండ్ స్టాఫ్ గుర్తించారు. ఇంకేముంది.. వెనక్కి రావాల్సిందేనని పైలట్‌కు ఆదేశాలు అందాయి.
ఒక విమానానికి ఉంది.. ఇంకోదానికి లేదు
అంతర్జాతీయ నిబంధనల ప్రకారం, ప్రతి విమాన రకానికి వేర్వేరు దేశాల నుంచి ప్రత్యేక అనుమతులు ఉండాలి. ఎయిర్ ఇండియా ప్రస్తుతం కెనడా సర్వీసుల కోసం బోయింగ్ 777-300ER విమానాలను వాడుతోంది. కానీ పొరపాటున ఈసారి బోయింగ్ 777-200LR రకానికి చెందిన విమానాన్ని పంపారు. దీనికి కెనడాలో ల్యాండ్ అయ్యే అనుమతి లేదు. ఆ చిన్న పర్మిషన్ లేకపోవడంతో, విమానాన్ని చైనా నుంచే వెనక్కి తిప్పాల్సి వచ్చింది. మొత్తంగా 7 గంటల 54 నిమిషాల ప్రయాణం తర్వాత విమానం మళ్ళీ ఢిల్లీలోనే సురక్షితంగా దిగింది.
భారీగా ఇంధనం వృథా.. కోట్లలో నష్టం
ఈ ఒక్క తప్పిదం వల్ల ఎయిర్ ఇండియాకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. సాధారణంగా బోయింగ్ 777 వంటి భారీ విమానాలు గంటకు 8 నుంచి 9 టన్నుల ఇంధనాన్ని ఖర్చు చేస్తాయి. అంటే 8 గంటల ప్రయాణానికి దాదాపు 70 టన్నుల ఇంధనం గాల్లో కలిసిపోయింది. దీని విలువ కొన్ని కోట్లలో ఉంటుంది. ఇంధనమే కాకుండా ప్రయాణికులకు హోటల్ వసతి కల్పించడం, మరుసటి రోజు మళ్ళీ విమానం ఏర్పాటు చేయడం వంటి ఖర్చులు అదనం.
ప్రయాణికుల అవస్థలు.. ఎయిర్ ఇండియా వివరణ
ఈ ఘటనపై ఎయిర్ ఇండియా స్పందిస్తూ.. ఇదొక ఆపరేషనల్ ఇష్యూ అని, ప్రయాణికుల భద్రత దృష్ట్యా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) ప్రకారం విమానాన్ని వెనక్కి రప్పించామని తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరింది. ఢిల్లీ చేరుకున్నాక వారందరికీ హోటల్ వసతి కల్పించి, మరుసటి రోజు ఉదయం మరో విమానంలో వ్యాంకోవర్‌కు పంపించారు. అయితే, అంతర్జాతీయ స్థాయిలో విమానాలు నడిపే సంస్థ ఇలాంటి ప్రాథమిక పర్మిషన్లను చెక్ చేసుకోకుండా విమానాన్ని ఎలా పంపించిందని నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు.




