Sonam Wangchuk: దిగొచ్చిన కేంద్రం.. దీక్ష విరమించిన సోనమ్ వాంగ్‌చుక్..!

Sonam Wangchuk: నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో 26 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ కేంద్రం రాతపూర్వక హామీ ఇవ్వడంతో దీక్ష విరమించారు.

Naresh.k
Published on: 24 July 2026 10:15 AM IST
Sonam Wangchuk
X

Sonam Wangchuk: దిగొచ్చిన కేంద్రం.. దీక్ష విరమించిన సోనమ్ వాంగ్‌చుక్..!

NEET Paper Leak: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో విద్యార్థుల భవిష్యత్తు కోసం జరిగిన సుదీర్ఘ పోరాటం ఒక కీలక మలుపు తిరిగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్‌తో గత 26 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ సామాజిక వేత్త, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఎట్టకేలకు గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత తన దీక్షను విరమించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సహా పలువురు కీలక నేతలు, ప్రముఖులతో జరిపిన సంప్రదింపులు సఫలం కావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

దీక్ష విరమణ అనంతరం సోనమ్ వాంగ్‌చుక్ ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా, కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన రాతపూర్వక హామీ లభించిన తర్వాతే తాను ఆహారం తీసుకున్నానని ఆయన స్పష్టం చేశారు.

జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులపై గానీ, జులై 20న నిర్వహించిన 'సంసద్ ఛలో' మార్చ్‌లో పాల్గొన్న వారిపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయరని, చట్టపరమైన చర్యలు ఉండవని కేంద్రం హామీ ఇచ్చింది. నీట్ పేపర్ లీక్ కలకలం, ఆ తదనంతరం తీవ్ర మనస్తాపంతో ప్రాణాలు కోల్పోయిన 20 మందికి పైగా విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం తగిన ఆర్థిక పరిహారం అందిస్తుంది. భవిష్యత్తులో ప్రవేశ పరీక్షల్లో ఇలాంటి అక్రమాలు, లీకేజీలు పునరావృతం కాకుండా పారదర్శకత, ప్రభుత్వ జవాబుదారీతనంపై రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేకంగా సుదీర్ఘ చర్చ జరపడానికి కేంద్రం అంగీకరించింది.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌పై మాట్లాడిన వాంగ్‌చుక్... మంత్రి ఎప్పుడు రాజీనామా చేస్తారనే దానిపై స్పష్టమైన కాలపరిమితి రాకపోయినప్పటికీ, ప్రస్తుతానికి విద్యార్థుల భవిష్యత్తును కాపాడుకోవడమే అత్యంత ముఖ్యమని భావించానని చెప్పారు. నా ప్రాణం కంటే విద్యార్థుల భవిష్యత్తు, వారిపై కేసులు లేకుండా చూడడమే నాకు ముఖ్యం. తప్పు జరిగినప్పుడు బాధ్యత వహించి మంత్రి రాజీనామా చేయకపోవడం వల్ల నైతికంగా ప్రభుత్వానికే నష్టమని ఆయన వ్యాఖ్యనించారు.

ఈ ధర్మపోరాటానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ, విద్యార్థులకు, పౌరసమాజానికి సోనమ్ వాంగ్‌చుక్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. 26 రోజుల పాటు సాగిన ఈ సుదీర్ఘ దీక్ష ఫలితంగా కేంద్రం దిగొచ్చి రాతపూర్వక హామీ ఇవ్వడం విద్యార్థుల ఉద్యమానికి దక్కిన పెద్ద విజయంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story