BRICS Summit: ఘనంగా ప్రారంభమైన బ్రిక్స్ సదస్సు...భారత్‌కు ప్రపంచ నేతలు

BRICS Summit: ఢిల్లీలోని భారత్ మండపంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఘనంగా ప్రారంభమైంది.

Gagan kumar
Published on: 12 Sept 2026 9:06 AM IST
BRICS Summit
X

BRICS Summit: ఘనంగా ప్రారంభమైన బ్రిక్స్ సదస్సు...భారత్‌కు ప్రపంచ నేతలు

BRICS Summit: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వాణిజ్య విధానాలతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సవాళ్లు ఎదుర్కొంటున్న వేళ.. ఒక కీలకమైన విశ్వవేదికకు భారత్ నాయకత్వం వహిస్తోంది. దేశ రాజధాని న్యూఢిల్లీలోని భారత్ మండపం వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు శని, ఆదివారాల్లో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వర్ధమాన దేశాలకు శరాఘాతంగా మారకుండా నిలువరించేందుకు, సరికొత్త వ్యూహాలకు పదును పెట్టేందుకు ప్రపంచ అగ్రనేతలంతా ఢిల్లీ నేలపై అడుగుపెట్టారు.

ప్రధాని నరేంద్ర మోదీతో పాటు చైనా అధినేత షి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సిసి సహా పలు దేశాల అగ్రనేతలు, ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్, న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ ఈ సదస్సుకు విచ్చేశారు. ఈ సదస్సులో సానుకూల, అత్యంత అర్థవంతమైన చర్చలు జరుగుతాయని, గ్లోబల్ సౌత్ దేశాల పురోగతికి కొత్త బాటలు వేస్తాయని ప్రధాని మోదీ 'ఎక్స్' వేదికగా ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం బ్రిక్స్ కూటమి అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్.. అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల ఆర్థిక ప్రయోజనాలు, ఇంధన భద్రత, సరఫరా వ్యవస్థల పునరుద్ధరణ వంటి అంశాలపై ప్రధానంగా గళమెత్తనుంది. ఒకప్పుడు బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలతో ప్రారంభమైన ఈ కూటమి విస్తరణ బాటలో పయనిస్తోంది. 2024లో ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, యూఏఈ, సౌదీ అరేబియాలు చేరగా, ఆ తదుపరి ఏడాది ఇండోనేషియా కూడా వచ్చి చేరింది. నిరుడు బెలారస్, బొలీవియా, కజఖ్‌స్థాన్, క్యూబా, మలేషియా, నైజీరియా, థాయ్‌లాండ్, ఉగాండా, ఉజ్బెకిస్థాన్, వియెత్నాంలు భాగస్వామ్య దేశాలుగా చేరడంతో బ్రిక్స్ బలం ప్రపంచ వేదికపై మరింత పెరిగింది.

సదస్సు ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీతో ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రధానంగా పశ్చిమాసియా సంక్షోభం, ఉక్రెయిన్ పరిస్థితులతో పాటు ప్రపంచ శాంతియుత మార్గాలపై వీరిద్దరూ సుదీర్ఘంగా చర్చించారు. ప్రపంచ ఆర్థిక, రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్న ఈ తరుణంలో భారత్ వేదికగా జరుగుతున్న ఈ బ్రిక్స్ సదస్సు ఎలాంటి కీలక నిర్ణయాలకు దారితీస్తుందోనని ప్రపంచదేశాలన్నీ ఉత్కంఠగా గమనిస్తున్నాయి.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.