Polavaram: ఘనంగా ప్రపంచ ఆదివాసీదినోత్సవ వేడుకలు కలెక్టర్ దినేష్ కుమార్
Polavaram: పోలవరం జిల్లాలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవవేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు ఆగస్టు 10న రంపచోడవరంలో ఈ వేడుకలు జరగనున్నాయి
Polavaram: ఘనంగా ప్రపంచ ఆదివాసీదినోత్సవ వేడుకలు కలెక్టర్ దినేష్ కుమార్
పోలవరం జిల్లా: ఏర్పాటు అనంతరం తొలిసారిగా నిర్వహించనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా, వినూత్నంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
ఆగస్టు 10 సోమవారం రంపచోడవరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో జిల్లా స్థాయి వేడుకలు ఘనంగా జరుగ నున్నాయని పేర్కొన్నారు.
జిల్లాలోని వివిధ మండలాల నుంచి గిరిజన సోదర సోదరీమణులను, యువతను, కళాబృందాలను ఆహ్వానించి ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం ప్రతిబింబించేలా కార్యక్రమాలను రూపొందించినట్లు కలెక్టర్ తెలిపారు. గిరిజనుల వారసత్వాన్ని ప్రజలకు పరిచయం చేయడం, వారి హక్కులపై అవగాహన పెంపొందించడం ఈ వేడుకల ప్రధాన ఉద్దేశమని చెప్పారు.
కార్యక్రమంలో ఆటల పోటీలు, సంప్రదాయ నృత్యాలు, జానపద ప్రదర్శనలు, గిరిజన కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అలాగే గిరిజన హక్కులు, అటవీ హక్కుల చట్టం (Forest Rights Act), పేసా చట్టం (PESA Act), 1/70 చట్టం తదితర అంశాలపై న్యాయ నిపుణులు, సంబంధిత అధికారులతో ప్రత్యేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే నాటికలు (స్కిట్స్) మరియు సాంస్కృతిక ప్రదర్శనల కోసం ప్రత్యేక పోటీలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ పోటీలకు మొదటి బహుమతిగా రూ.30,000, రెండో బహుమతిగా రూ.20,000, మూడో బహుమతిగా రూ.10,000 కేటాయించినట్లు తెలిపారు. ఎంపికైన బృందాలకు జిల్లా స్థాయి ప్రధాన కార్యక్రమంలో ప్రజల సమక్షంలో ప్రదర్శన ఇచ్చే అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు.
ఆదివాసీ సంప్రదాయాలు, హస్తకళలు, వంటకాలు, జీవన విధానాన్ని ప్రతిబింబించే ప్రత్యేక ప్రదర్శన స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలోని ప్రతి పౌరుడు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, కళాబృందాలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని గిరిజన ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి సంస్కృతి, సంప్రదాయాలు, హక్కుల పరిరక్షణకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు.




