Suryapet: గురువు వృత్తి ఎంతో పవిత్రమైనది: ఎస్పీ నరసింహ!
Suryapet: సూర్యాపేట జిల్లా కందగట్ల ఉన్నత పాఠశాల హెచ్ఎం వాడపల్లి మురళీకృష్ణ పదవీ విరమణ సన్మాన సభలో ఎస్పీ నరసింహ ఐపీఎస్ పాల్గొన్నారు.
Suryapet: గురువు వృత్తి ఎంతో పవిత్రమైనది: ఎస్పీ నరసింహ!
సూర్యాపేట: ఆత్మకూరు(ఎస్) మండలం కందగట్ల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తూ ఉద్యోగ విరమణ పొందిన వాడపల్లి మురళీకృష్ణ సన్మాన కార్యక్రమం కందగట్ల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ హాజరై మురళీకృష్ణ దంపతులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... గురువు వృత్తి ఎంతో విలువైనదని, పవిత్రమైనదని అన్నారు. గురువులు భవిష్యత్తు వనరులను తీర్చిదిద్దుతారని అన్నారు. ఉపాధ్యాయునిగా మురళీకృష్ణ సార్ ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారని, ఆయన వద్ద విద్యను అభ్యసించిన ఎంతో మంది నేడు ఉన్నత స్థాయిలో ఉన్నారని తెలిపారు.
ఈ కార్యక్రమానికి హాజరై ఆయనను సత్కరించడం నాకు ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది. మురళీకృష్ణ సార్ మా సొంత గ్రామంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న సమయంలో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. ఆ సమయంలో సార్ అందించిన మోటివేషన్, మార్గదర్శకత్వం, ప్రోత్సాహం నా జీవితంలో ఎంతో ప్రభావం చూపాయి. సార్ నాకు ప్రత్యక్షంగా పాఠాలు బోధించకపోయినా, ఆయనను నేను ఎప్పుడూ నా గురువుగానే భావించాను" అని అన్నారు.
ఉపాధ్యాయ వృత్తి అత్యంత గౌరవప్రదమైనదే కాకుండా ఎంతో బాధ్యతతో కూడుకున్నదని, తరగతి గదిలో విద్యను బోధించడమే కాకుండా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యతను కూడా నిర్వర్తిస్తారని అన్నారు. మురళీకృష్ణ సార్ తన ప్రతిభ, అంకితభావం, సేవా తత్పరతతో ప్రధానోపాధ్యాయుని స్థాయికి చేరుకుని నేడు పదవీ విరమణ పొందడం అభినందనీయమన్నారు.
పదవీ విరమణ అనేది సేవకు ముగింపు కాదు, ఒక కొత్త అధ్యాయానికి ఆరంభమని, ఇన్నేళ్లుగా సంపాదించిన జ్ఞానాన్ని, అనుభవాన్ని భవిష్యత్ తరాలకు అందించాలని కోరారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆయురారోగ్యాలతో, ఆనందంగా జీవితం గడపాలని ఆకాంక్షించారు. "ఉపాధ్యాయుని సేవకు పదవీ విరమణ ఉండొచ్చు... కానీ ఆయన బోధించిన విలువలకు, ఆయన చూపిన మార్గానికి ఎప్పటికీ పదవీ విరమణ ఉండదు" అని ఎస్పీ నరసింహ అన్నారు.




