Suryapet: ఉపాధ్యాయులతోనే సమాజంలో సమూల మార్పు: కలెక్టర్ తేజస్!

Suryapet: ఉపాధ్యాయుల ద్వారానే సమాజంలో సమూల మార్పు సాధ్యమని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 5 Sept 2026 5:12 PM IST
Suryapet
X

Suryapet: ఉపాధ్యాయులతోనే సమాజంలో సమూల మార్పు: కలెక్టర్ తేజస్!

సూర్యాపేట: సమాజంలో బలమైన మార్పు తీసుకురావాలన్నా, ఉత్తమమైన రాష్ట్రాన్ని, దేశాన్ని నిర్మించాలన్నా అది కేవలం ఉపాధ్యాయుల ద్వారానే సాధ్యమని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.

శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన గురుపూజోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులకు అవార్డులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తన జీవిత ప్రయాణంలో గురువుల పాత్రను గుర్తుచేసుకున్నారు. తాను మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా మాలేగావ్ తాలూకా సౌందనే గ్రామంలో పుట్టి పెరిగానని, తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులు కావడంతో తన బడి ప్రయాణం పుట్టిన రోజు నుంచే మొదలైందని తెలిపారు. జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తన అక్షరాభ్యాసం సాగిందన్నారు.

ఆ తర్వాత సాతారాలోని సైనిక్ స్కూల్, ఇంజనీరింగ్, యూపీఎస్సీ ప్రస్థానంలో తనకు మార్గదర్శనం చేసిన ప్రతి గురువును స్మరించుకున్నారు. సివిల్ సర్వీసెస్ లోకి వచ్చాక లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లోని గురువులతో పాటు తన మొదటి కలెక్టర్లు సత్యనారాయణ, శరత్, వెంకట్రావు వంటి సీనియర్ అధికారులు, జూనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్ల నుంచి ఎన్నో నేర్చుకున్నానని చెప్పారు.

సాధారణంగా స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల్లో ఇచ్చే ప్రశంసా పత్రాలు పరిమితులకు లోబడి ఉంటాయని, అందుకే ఈసారి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డీఈఓ పరిధిలోని పాఠశాలలతో పాటు ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, రెసిడెన్షియల్, వెల్ఫేర్ పాఠశాలల ఉపాధ్యాయులను కూడా ఎంపిక చేసి కలెక్టర్ ప్రత్యేక ప్రశంసా పత్రాలు అందజేస్తున్నట్లు తెలిపారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా బోధన పద్ధతులు మారాలని సూచించారు. 30 ఏళ్ల క్రితం కాలినడకన, సైకిళ్లపై వెళ్లే పరిస్థితుల నుంచి నేడు జీవనశైలి మారిపోయిందన్నారు. గతంలో విజ్ఞానం కోసం పుస్తకాలు, గురువులపైనే ఆధారపడేవారని, తర్వాత వికీపీడియా, ఇప్పుడు పర్ప్లెక్సిటీ వంటి సాంకేతిక సెర్చ్ ఇంజన్ల యుగం నడుస్తోందని, ఎంత సాంకేతికత వచ్చినా, కృత్రిమ మేధ పెరిగినా విద్యార్థిని వ్యక్తిగతంగా సరైన మార్గంలో నడిపించే గురువు స్థానాన్ని ఏ యంత్రమూ భర్తీ చేయలేదని స్పష్టం చేశారు.

విద్యార్థులకు కేవలం పాఠ్యపుస్తకాల జ్ఞానం మాత్రమే కాకుండా ఏది మంచి, ఏది చెడు అని గ్రహించే నిర్ణయాత్మక శక్తిని, మానవతా విలువలను పెంపొందించడం ఉపాధ్యాయుల బాధ్యత అన్నారు. సూర్యాపేట జిల్లా చైతన్యవంతమైన జిల్లా అని, ఇక్కడి విద్యా రంగం ప్రస్తుతం టేకాఫ్ దశలో ఉందని, ఆకాశమే హద్దుగా పురోగతి సాధించాలని ఆకాంక్షించారు.

సూర్యాపేట జిల్లా పేరులో ఉన్న సూర్యుడిలా విద్యా రంగం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచి వెలగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా భారత తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కు నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి ప్రేమ్ రాజ్, డీఐఓ సులోచన రాణి, ఆర్సీఓలు, పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story