Suryapet: ఏపూరు తండాలో పంచాయతీ భవన రగడ రెండుతండాల మధ్య తీవ్ర ఉద్రిక్తత
Suryapet: సూర్యాపేట జిల్లా ఏపూరు తండా పంచాయతీ భవన వివాదం ఉద్రిక్తంగా మారింది. పాత పాఠశాల కూల్చివేతపై గ్రామీణుల మధ్య వాగ్వాదం జరగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు!
Suryapet: ఏపూరు తండాలో పంచాయతీ భవన రగడ రెండుతండాల మధ్య తీవ్ర ఉద్రిక్తత
ఏపూరు తండా పంచాయతీ భవన వివాదం: పాత పాఠశాల కూల్చివేతపై రెండు తండాల మధ్య ఉద్రిక్తత
సూర్యాపేట: ఆత్మకూర్ (ఎస్) మండలం ఏపూరు తండా గ్రామ పంచాయతీలో కొత్త పంచాయతీ భవన నిర్మాణం తీవ్ర వివాదానికి దారితీసింది. భవనాన్ని ఎక్కడ నిర్మించాలనే అంశంపై రెండు తండాల వాసులు పట్టుబడటంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
బోడతండా, మాన్య తండాలు కలిసి ఏపూరు తండా గ్రామ పంచాయతీగా ఏర్పడ్డాయి. గతంలో పంచాయతీ భవనం కోసం మాజీ సర్పంచ్ ముకుంద, మాన్య తండాలో మూడు గుంటల భూమిని విరాళంగా ఇచ్చారు. అయితే ప్రస్తుత సర్పంచ్ జయరాజు ఆ ప్రతిపాదనను పక్కనపెట్టి, భవనాన్ని తన స్వంత గ్రామమైన బోడతండాలోనే నిర్మించాలని పట్టుబడుతున్నారు.
ఈ క్రమంలో మూడు రోజుల క్రితం బోడతండాలో మూతపడి శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాన్ని సర్పంచ్ కూల్చివేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో మాన్య తండా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సర్పంచ్ ఏమన్నారంటే...
ఈ వివాదంపై సర్పంచ్ జయరాజ్ స్పందిస్తూ, "గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసమే ఈ చర్యలు తీసుకున్నాం. అధికారుల నుండి ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతే పాత పాఠశాల భవనాన్ని కూల్చివేశాం. ఇందులో ఎలాంటి అక్రమాలు లేవు" అని తెలిపారు.
మాన్య తండా వాసుల ఆరోపణ
అయితే అధికారులు కేటాయించిన స్థలంలో కాకుండా తమ ఇష్టానుసారంగా పాఠశాల భవనాన్ని ఎలా కూల్చివేస్తారని మాన్యతండా వాసులు ప్రశ్నిస్తున్నారు. భవనాన్ని తమ తండాలోనే నిర్మించాలని వారు పట్టుబడుతున్నారు.
ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు వాగ్వాదానికి దిగడంతో విషయం జిల్లా కలెక్టర్ వరకు వెళ్లింది. సమాచారం అందుకున్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆత్మకూర్ (ఎస్) ఎస్ఐ అవిలయ్య ఏపూరు తండాను సందర్శించి రెండు వర్గాలతో చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ, "గ్రామాభివృద్ధి కోసం నిర్మించే పంచాయతీ భవనంపై ఇరు వర్గాలు గొడవపడటం సరికాదు. రెండు తండాల ప్రజలకు అనువైన, అందరికీ అందుబాటులో ఉండే స్థలంలోనే పంచాయతీ భవనాన్ని నిర్మించుకోవాలి. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు" అని హెచ్చరించారు.
ప్రస్తుతం పోలీసులు గ్రామంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు.




