Suryapet: సూర్యాపేట రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్ద హైడ్రామా
Suryapet: సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద భూ వివాదం నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Suryapet: సూర్యాపేట రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్ద హైడ్రామా
సూర్యాపేట: సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద శుక్రవారం భూ వివాదం నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారంటూ రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
అంజనపురి కాలనీలోని వజ్ర టౌన్‌షిప్‌లోని సర్వే నెంబర్లు 478, 479, 480 భూములకు సంబంధించిన వివాదం ఇది. తాము కష్టపడి కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకున్న ప్లాట్లను వేరొకరికి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని TRP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో బాధితులు కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.
వజ్ర టౌన్‌షిప్ ప్లాట్ల యజమాని నల్లు ఉమా జ్యోతిరెడ్డి తప్పుడు పత్రాలతో మరోసారి రిజిస్ట్రేషన్ చేసేందుకు వస్తున్నారని, దానిని అడ్డుకునేందుకు ఇళ్లు నిర్మించుకున్న వారితో కలిసి తాము వచ్చినట్లు జానయ్య యాదవ్ తెలిపారు. దీంతో లా అండ్ ఆర్డర్‌కు భంగం కలుగుతుందని పట్టణ సీఐ వెంకటయ్య వారిని అడ్డుకోగా వాగ్వాదం చెలరేగింది.
పోలీసులు ఉద్రిక్తతను గమనించి జానయ్య యాదవ్‌తో పాటు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గతంలో రూరల్ పోలీస్ స్టేషన్‌లో అక్రమ రిజిస్ట్రేషన్‌పై కేసులు పెట్టినా చర్యలు లేవని, అధికార పార్టీ నేతలకు పోలీసులు కొమ్ము కాస్తున్నారని జానయ్య యాదవ్ ఆరోపించారు. మున్సిపల్ సిబ్బందితో బలహీన వర్గాల నిర్మాణ సామగ్రిని బలవంతంగా తరలించారని కూడా మండిపడ్డారు.
అనంతరం భూ యజమానురాలు నల్లు ఉమా జ్యోతిరెడ్డి పోలీసు భద్రత మధ్య కార్యాలయానికి చేరుకుని జీపీఏ చేయించుకుని వెళ్లారు. సదరు భూములు తమ పేరు మీదే ఉన్నాయని, ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఆమె స్పష్టం చేశారు.
పోలీసులు ఇరు వర్గాలతో మాట్లాడి సివిల్ వివాదంలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ ఘటనతో రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద ఉదయం నుంచి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.




