Suryapet: చివ్వెంల పీఎస్‌లో ఎస్పీ నరసింహ ఆకస్మిక తనిఖీ

Suryapet: సూర్యాపేట జిల్లా చివ్వెంల పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 20 July 2026 6:55 AM IST
Suryapet
X

Suryapet: చివ్వెంల పీఎస్‌లో ఎస్పీ నరసింహ ఆకస్మిక తనిఖీ

సూర్యాపేట: ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదివారం చివ్వెంల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బంది విధుల నిర్వహణ, అంకితభావాన్ని ఎస్పీ నిశితంగా పరిశీలించారు. స్టేషన్‌లోని గ్రామాల రికార్డులు, కేసుల నమోదు ప్రక్రియ, దర్యాప్తు పురోగతి, ఫిర్యాదుల నిర్వహణ తీరుకు సంబంధించిన వివిధ రికార్డులను కూడా ఆయన తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ ఐపీఎస్ సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ప్రజలకు మరింత మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించాలని ఆయన సూచించారు.

సైబర్ మోసాలకు గురైన బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా, వారు పోగొట్టుకున్న నగదు త్వరగా రిఫండ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళలు, బాలల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, వారి నుంచి ఫిర్యాదులు వస్తే వేగంగా స్పందించి అండగా నిలవాలని తెలిపారు.

జాతీయ రహదారి 65 చివ్వెంల మండలం మీదుగా వెళుతుందని, జిల్లా కేంద్రానికి వచ్చే ప్రధాన రహదారులు ఇక్కడి నుంచే ఉన్నాయని పేర్కొన్న ఎస్పీ, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని సూచించారు. మండల పరిధిలో ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా నిఘా ఉంచాలని,

అసాంఘిక కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణచివేయాలని ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని, పాత నేరస్థులు, నిందితులను చట్టప్రకారం బైండోవర్ చేయాలని స్పష్టం చేశారు.

ఈ తనిఖీ కార్యక్రమంలో సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్న కుమార్, సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, చివ్వెంల ఎస్ఐ మహేష్ తో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story