Suryapet: సూర్యాపేట జిల్లాలో అక్రమ రవాణా నిర్మూలనకు పటిష్ట చర్యలు!

Suryapet: సూర్యాపేట జిల్లాలో అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసు శాఖ 24 గంటల నిఘా ఏర్పాటు చేసింది.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 13 May 2026 8:03 AM IST
Suryapet
X

Suryapet: సూర్యాపేట జిల్లాలో అక్రమ రవాణా నిర్మూలనకు పటిష్ట చర్యలు!

సూర్యాపేట: జిల్లాలో పశువులు, ఇసుక, వరి ధాన్యం, పీడీఎస్ బియ్యం వంటి వాటి అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసు శాఖ 24 గంటల పాటు కఠిన తనిఖీలు నిర్వహిస్తోందని జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ముఖ్యమైన ప్రాంతాలలో అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై పూర్తిస్థాయిలో నిఘా ఉంచినట్లు చెప్పారు.

బుధవారం సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి 65పై టేకుమట్ల వద్ద ఏర్పాటు చేసిన అంతర్ జిల్లా చెక్ పోస్ట్‌ను ఎస్పీ నరసింహ ఆకస్మికంగా సందర్శించారు. వాహనాల తనిఖీల ప్రక్రియను పరిశీలించి, చెక్ పోస్ట్ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా తనిఖీలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. అలాగే తనిఖీల సమయంలో చెక్ పోస్ట్ సిబ్బంది స్వీయ రక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.

వరి ధాన్యం, పీడీఎస్ బియ్యం, ఇసుక, పశువుల అక్రమ రవాణా జరగకుండా రాత్రింబవళ్ళు తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అక్రమ రవాణాకు పాల్పడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు వ్యవసాయ అవసరాల కోసం సంతలో కొనుగోలు చేసిన పశువులను రవాణా చేసే సమయంలో సంత అధికారులు, పశు వైద్యుల అనుమతి పత్రాలు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని ఎస్పీ సూచించారు.

ఈ పరిశీలనలో ఎస్పీ వెంట సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, ఎస్సై బాలు నాయక్, చెక్ పోస్ట్ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, జాతీయ రహదారుల శాఖ సిబ్బంది ఉన్నారు. ఏమైనా అనుమానాస్పద రవాణా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ ప్రజలను కోరారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story