Suryapet: సూర్యాపేట టౌన్ పీఎస్‌లో ఎస్పీ నరసింహ ఆకస్మిక తనిఖీ!

Suryapet: సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ నరసింహ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వినాయక చవితి ఉత్సవాలపై సమీక్షించి, డీజేల వాడకాన్ని నియంత్రించాలని ఆదేశించారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 4 Sept 2026 3:20 PM IST
Suryapet
X

Suryapet: సూర్యాపేట టౌన్ పీఎస్‌లో ఎస్పీ నరసింహ ఆకస్మిక తనిఖీ!

Suryapet: జిల్లా ఎస్పీ నరసింహ, ఐపీఎస్ గురువారం సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను, రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధి నిర్వహణ తీరు, బాధితులకు అందుతున్న సేవలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణే ప్రధాన ధ్యేయమని, పోలీస్ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా జరగకుండా పటిష్ట నిఘా ఉంచాలని, పట్టణంలోకి వచ్చే కొత్త వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా వేయాలని సూచించారు.

నేరాల నియంత్రణకు పట్టణంలో వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పెట్రో కార్, బ్లూ కోట్స్ సిబ్బంది 24 గంటల పాటు క్షేత్రస్థాయిలో గస్తీ నిర్వహించాలని, రాత్రివేళ వాహనాల తనిఖీలు, అనుమానితుల వేలిముద్రల పరిశీలన చేపట్టాలని ఆదేశించారు.

రానున్న వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. స్థానిక పెద్దలు, ఉత్సవ కమిటీలతో శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించాలని, గణేష్ మండపాల ఏర్పాటుకు కమిటీలు ముందస్తు అనుమతులు తీసుకునేలా అవగాహన కల్పించాలని చెప్పారు. రాకపోకలకు ఇబ్బంది కలగకుండా రోడ్లపై మండపాలు ఏర్పాటు చేయవద్దని స్పష్టం చేశారు. పట్టణంలో ఎన్ని విగ్రహాలు ఏర్పాటు అవుతాయో ముందే అంచనా వేసి నంబరింగ్ కేటాయించి, నిమజ్జన రూట్లను ముందుగానే పరిశీలించాలని సూచించారు.

పండుగల సమయంలో డీజేల వల్ల ప్రమాదాలు, మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో డీజేల వాడకాన్ని పూర్తిగా నియంత్రించాలని, డీజే నిర్వాహకులను పిలిపించి ముందస్తుగా బైండోవర్ చేయాలని ఆదేశించారు. డీజేల వల్ల కలిగే నష్టాలపై భక్తులకు, కమిటీలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు.

పోలీస్ యంత్రాంగం ప్రజల వినతులు, ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తూ పారదర్శకంగా పనిచేయాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ తనిఖీలో పట్టణ సీఐ వెంకటయ్య, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఎస్ఐలు సాయిరాం, రామచందర్, రహిముద్దీన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story