Suryapet: పేదరికం లక్ష్యానికి అడ్డంకి కాదు: ఎస్పీ నరసింహ ప్రశంస!

Suryapet: నీట్ ద్వారా గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించిన నిరుపేద విద్యార్థిని ఇందుకు రూ.20 వేల ఆర్థిక సాయం అందజేసి అండగా నిలిచిన ఎస్పీ కె. నరసింహ.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 12 Sept 2026 9:48 AM IST
Suryapet
X

Suryapet: పేదరికం లక్ష్యానికి అడ్డంకి కాదు: ఎస్పీ నరసింహ ప్రశంస!

Suryapet: మానవతా దృక్పథాన్ని చాటుకున్న సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ ఐపీఎస్. ప్రభుత్వ గురుకులంలో చదివి గాంధీ మెడికల్ కాలేజీలో MBBS సీటు సాధించిన నిరుపేద విద్యార్థినికి ఆర్థిక సహాయం అందించి అభినందించారు.

పెన్‌పహాడ్ మండలం అనంతారం గ్రామానికి చెందిన మామిడి అంజయ్య, ప్రసన్న దంపతుల కుమార్తె మామిడి ఇందు ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు, హైదరాబాద్ గౌడిగూడ గురుకుల కళాశాలలో ఇంటర్ విద్యను పూర్తి చేసింది.

తండ్రి అంజయ్య దివ్యాంగుడు, ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక స్కావెంజర్‌గా పనిచేస్తుండగా, తల్లి ప్రసన్న దినసరి కూలీగా కుటుంబాన్ని పోషిస్తోంది. ఆర్థిక ఇబ్బందులు, అంగవైకల్యాన్ని అధిగమించి కష్టపడి చదివిన ఇందు NEET లో మంచి ర్యాంక్ సాధించి గాంధీ మెడికల్ కాలేజీలో MBBS సీటు సాధించింది.

ఇందు చదువుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న విషయం సోషల్ మీడియాలో వెలుగులోకి రావడంతో ఎస్పీ నరసింహ స్పందించారు. గురువారం తన కార్యాలయంలో విద్యార్థిని ఇందును పిలిపించి రూ.20,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబానికి చెందినప్పటికీ పట్టుదలతో చదివి MBBS సీటు సాధించడం అభినందనీయమన్నారు. "పేదరికం లక్ష్యానికి అడ్డంకి కాదు.. పట్టుదల, కష్టపడే తత్వం ఉంటే ఏదైనా సాధించవచ్చని ఇందు నిరూపించింది" అని అన్నారు.

ఇందు మంచి వైద్యురాలిగా ఎదిగి పేదలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో చదువుకు ఎలాంటి సహాయం కావాలన్నా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, పోలీస్ వెల్ఫేర్ ఆర్ఎస్ఐ సాయిరాం పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA