Suryapet: సూర్యాపేటలో దారుణం: సామాజిక కార్యకర్తపై గొడ్డలితో దాడి!
Suryapet: సూర్యాపేట జిల్లా మునగాలలో కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణపై పోరాడుతున్న సామాజిక కార్యకర్త ఎర్రబెల్లిపై భూకబ్జాదారులు గొడ్డలితో హత్యాయత్నం చేశారు.
Suryapet: సూర్యాపేటలో దారుణం: సామాజిక కార్యకర్తపై గొడ్డలితో దాడి!
విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణపై పోరాడుతున్న ఓ పోరాటయోధుడిపై దురాఘాతం...
గొడ్డలితో నడిరోడ్డుపై కాపు కాసి మరీ హత్యాయత్నానికి పాల్పడ్డారు దుర్మార్గులు
సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో ఈ దారుణం జరిగింది. గణపవరం రోడ్డులో పెట్రోల్ బంక్ పక్కన ఉన్న లక్షల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణపై గడ్డం వెంకన్న అలియాస్ ఎర్రబెల్లి ఎన్నో ఏండ్లుగా చట్టపరంగా పోరాటం చేస్తున్నారు. గతంలో సీపీఎం ఆధ్వర్యంలో ఆ భూమిలో ఎర్రజెండాలు పాతి పేదలకు పంచాలని డిమాండ్ చేసారు. ఇటీవల ఆ విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని ప్రజా అవసరాలకు వినియోగించాలని ఎర్రబెల్లి కోదాడ ఆర్డీవో సూర్యనారాయణకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆర్డీవో.. ఆ భూమికి రక్షణ కంచె ఏర్పాటు చేసి చెట్లు పెంపకం చేపట్టాలని తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. దీంతో గత రెండు రోజులుగా ఉపాధి హామీ కూలీల చేత 300కు పైగా గుంతలు తీసి మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతోంది. తమ భూ ఆక్రమణకు అడ్డు వస్తున్నాడనే కక్షతో. శుక్రవారం సాయంత్రం నడిరోడ్డుపై కాపు కాసిన ఆక్రమణదారులు ఎర్రబెల్లిపై గొడ్డలితో దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయాలై రక్తస్రావం అయింది. హుటాహుటిన 108 వాహనంలో కోదాడ ఆసుపత్రికి, మెరుగైన వైద్యం కోసం అర్ధరాత్రి సూర్యాపేటకు తరలించారు. పథకం ప్రకారమే భూ ఆక్రమణదారులు ఈ హత్యాయత్నానికి పాల్పడ్డారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రజా ప్రయోజనాల కోసం పోరాడే వారిపై ఇలాంటి దాడి జరగడం పట్ల సర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.




