Suryapet: సూర్యాపేటలో ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

Suryapet: సూర్యాపేటలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ. వచ్చే జయంతి నాటికి నగరంలో పాపన్న విగ్రహ ఏర్పాటుకు తీర్మానం.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 18 Aug 2026 9:16 PM IST
Suryapet
X

Suryapet: సూర్యాపేటలో ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

సూర్యాపేట: తొలి తెలుగు దళిత బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు సూర్యాపేటలో ఘనంగా నిర్వహించారు. మూడున్నర శతాబ్దాల క్రితమే భూస్వాములు, నిజాం, మొగలాయిలకు వ్యతిరేకంగా 12 వేల మంది సైన్యంతో పోరాడి అనేక కోటలు నిర్మించిన పాపన్న స్ఫూర్తితో బహుజన రాజ్య స్థాపనకు కృషి చేయాలని సబ్బండ వర్గాల నాయకులు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వై. వెంకటేశ్వర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా మాట్లాడుతూ పాపన్న ఒక కులానికి పరిమితం కాకుండా అన్ని సబ్బండ వర్గాలను కలుపుకొని ఆధిపత్యం, అసమానతలపై పోరాడిన మహనీయుడని కొనియాడారు.

పాపన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు సూర్యాపేట పౌర సమాజం భాగస్వామ్యంతో కోర్టు చౌరస్తా వద్ద పాపన్న విగ్రహాన్ని వచ్చే జయంతి నాటికి ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఇందుకు పార్టీలకు, కులాలకు, సంఘాలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరారు. విగ్రహ ఏర్పాటుకు తమ పూర్తి సహకారం ఉంటుందని షఫీ ఉల్లా హామీ ఇచ్చారు.

ప్రస్తుతం పాపన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను చిత్రపటాలతో నిర్వహించడం బాధాకరమని, ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నామని చెప్పినా అది తూతూ మంత్రంగా మిగులుతోందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు, బలహీన, అణగారిన వర్గాలు ఐక్యంగా చైతన్యంతో ముందుకు వెళ్లి పాపన్న ఆశయ సాధనకు కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్, ఆర్యవైశ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారు రాజా, జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్, బిఆర్ఎస్ నాయకులు బూర బాల సైదులు గౌడ్, కౌన్సిలర్లు బైరు శైలేందర్ గౌడ్, అంగిరేకుల నాగార్జున, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు చింతలపాటి చిన్న శ్రీరాములు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తలమల్ల హస్సేన్, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్, కాంగ్రెస్, బిజెపి, సిపిఐ తదితర పార్టీల నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story